
Vaibhav Sooryavanshi: ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త సంచలనం, భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ పవర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ ఛానెల్ ‘ది స్విచ్’ (The Switch) వేదికగా నిర్వహించిన ఒక అసాధారణ క్రికెట్ ఛాలెంజ్‌లో వైభవ్ కేవలం 25 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ కోసం ఒక ప్రత్యేకమైన బ్యాటింగ్ ఛాలెంజ్‌ను రూపొందించాడు. ఈ ఛాలెంజ్ ప్రకారం.. బ్యాటర్ కేవలం 50 బంతుల్లో 100 పరుగులు చేయాలి. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. బౌలింగ్ మెషిన్ ద్వారా వచ్చే ప్రతి బంతి వేగం అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది. మొదటి బంతి గంటకు 51 మైళ్ల (51 mph) వేగంతో వస్తే, చివరి బంతి నాటికి అది ఏకంగా 100 మైళ్ల (100 mph) వేగాన్ని అందుకుంటుంది. ఈ కఠినమైన సవాలును స్వీకరించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, మైదానంలో దిగిన నిమిషం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
వైభవ్ క్రీజులోకి రాగానే తన అద్భుతమైన బ్యాట్ స్పీడ్‌తో బంతిని బౌండరీల అవతలకు పంపడం ప్రారంభించాడు. మొదటి బంతికే సిక్సర్‌తో ఖాతా తెరిచిన ఈ యువ సంచలనం, ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో మూడు భారీ సిక్సర్లు బాదాడు. బంతి వేగం పెరుగుతున్న కొద్దీ వైభవ్ టైమింగ్, రిస్ట్ కంట్రోల్ మరింత మెరుగయ్యాయి. కేవలం 10 బంతుల్లోనే 8 సిక్సర్ల సాయంతో అర్ధశతకం (53 పరుగులు) పూర్తి చేసుకుని పీటర్సన్‌ను సైతం నోరెళ్లబెట్టేలా చేశాడు. గాల్లోకి బ్యాట్ ఎత్తుతూ తనదైన శైలిలో హాఫ్ సెంచరీ వేడుకలను జరుపుకున్నాడు.
ఈ ఛాలెంజ్ మధ్యలో పీటర్సన్‌తో మాట్లాడిన వైభవ్, తన మనసులోని పెద్ద ఆశయాన్ని బయటపెట్టాడు. టి20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టడమే తన లక్ష్యమని, టి20ల్లో డబుల్ సెంచరీ (200 పరుగులు) సాధించడమే తన అంతిమ ధ్యేయమని ధీమాగా చెప్పాడు. అంతేకాదు, గతంలో ఆసియా కప్ ఎమర్జింగ్ టోర్నీలో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నానని, దేశవాళీ వన్డే మ్యాచ్‌లో ఏకంగా 335 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచానని గుర్తుచేశాడు .
వైభవ్ ఆడుతున్న అద్భుతమైన షాట్లను చూసి ఆశ్చర్యపోయిన కెవిన్ పీటర్సన్, ఈ 15 ఏళ్ల కుర్రాడిలో ఉన్న అంతటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోవడానికి ‘గూగుల్ జెమిని’ (Google Gemini) ఏఐ సాయం తీసుకున్నాడు. వైభవ్ బ్యాటింగ్ శైలిని విశ్లేషించిన జెమిని.. అతనికి ఉన్న అసాధారణ బ్యాట్ స్పీడ్, అద్భుతమైన మణికట్టు కదలికలు (wrist control) అత్యంత వేగంగా వచ్చే బంతులను సైతం ఈజీగా బౌండరీ దాటించడానికి ఉపయోగపడుతున్నాయని పేర్కొంది. అలాగే ఏమాత్రం భయం లేని అతని ఫీర్-లెస్ మైండ్‌సెట్ అతడిని ప్రత్యేకంగా నిలుపుతుందని స్పష్టం చేసింది.
చివరకు కేవలం 25 బంతుల్లోనే 14 సిక్సర్ల సునామీతో వైభవ్ సూర్యవంశీ ఈ 100 పరుగుల మైలురాయిని అధిగమించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..