ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్ చివరిదశకు చేరుకుంది. రసవత్తరంగా మారిన ఫైనల్ రేసులో.. ఏ రెండు జట్లు అగ్రస్థానంలో నిలుస్తాయో వేచి చూడాల్సిందే. కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న.. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో జూన్ 11-15 మధ్య లార్డ్స్‌లో జరిగే WTC ఫైనల్‌కు ఎవరు చేరతారో తేలిపోనుంది. ఇక నెక్స్ట్ WTC 2025-27 సైకిల్ ప్రారంభమవుతుంది. ఈ సైకిల్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లు ఏంటి.? ఏయే జట్లతో తలబడుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో టీమిండియా 6 జట్లతో తలపడనుంది. వీటిలో 3 సిరీస్‌లు స్వదేశంలో, 3 విదేశీ గడ్డపై ఆడాల్సి ఉంది. జూన్ 2025లో ప్రారంభమయ్యే ఈ సైకిల్‌లో, భారత జట్టు మొదటిగా ఇంగ్లాండ్ జట్టుతో ఆడుతుంది. 5 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్ 20 జూన్ 2025 నుంచి ప్రారంభమవుతుంది. దీని చివరి మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ ఇంగ్లాండ్ గడ్డపైనే జరుగుతాయి. దీంతో పాటు విదేశీ గడ్డపై న్యూజిలాండ్, శ్రీలంకతో భారత్ తలపడాల్సి ఉంది. అలాగే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇంకా ఈ మ్యాచ్‌ల తేదీలపై ఇంకా తేలాల్సి ఉంది.
WTC 2025-27 సైకిల్‌లో అన్ని జట్లు 6 సిరీస్‌లు ఆడబోతున్నాయి. ఇందులో స్వదేశంలో 3, విదేశీ గడ్డపై 3 ఆడాల్సి ఉంటుంది. స్వదేశంలో జరిగే టెస్టులలో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అదే సమయంలో, విదేశీ గడ్డపై భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో ఉంటాయి. భారత్‌తో పాటు ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో స్వదేశంలో తలపడనుంది. విదేశీ గడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో ఉంటాయి.
స్వదేశీ సిరీస్‌లో భారత్, వెస్టిండీస్, శ్రీలంకతో న్యూజిలాండ్ ఆడనుంది. విదేశీ గడ్డపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్‌లతో తలపడనుంది. దక్షిణాఫ్రికా తదుపరి సైకిల్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లతో స్వదేశంలో సిరీస్‌లు ఆడనుంది. విదేశీ పర్యటనల కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంకలతో ఆడనుంది.
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలతో పాకిస్థాన్ తన స్వదేశంలో సిరీస్‌లు ఆడనుండగా.. విదేశీ పర్యటనల కోసం ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు శ్రీలంక స్వదేశంలో భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో తలపడుతుంది. అనంతరం న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్‌లలో పర్యటిస్తుంది.
వెస్టిండీస్ తదుపరి సైకిల్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్‌లతో స్వదేశీ సిరీస్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అదే సమయంలో, 3 విదేశీ సిరీస్‌ల కోసం భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్‌లతో స్వదేశీ సిరీస్‌లు.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంకతో విదేశీ పర్యటనలు చేస్తుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..