
Smriti Mandhana – Jemimah Rodrigues: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) తన స్నేహితురాలు స్మృతి మంధాన (Smriti Mandhana) కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ కష్ట సమయంలో స్మృతికి తోడుగా నిలిచేందుకు జెమీమా ఆస్ట్రేలియా వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది.
టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన వివాహం మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే, పెళ్లి రోజు ఉదయం స్మృతి తండ్రికి స్వల్ప గుండెపోటు రావడంతో వివాహాన్ని వాయిదా వేశారు. మరోవైపు, వరుడు పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో తన స్నేహితురాలికి అండగా ఉండాలని జెమీమా భావించారు. బ్రిస్బేన్ హీట్ (Brisbane Heat) జట్టు తరపున ఆడుతున్న ఆమె, లీగ్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
జెమీమా నిర్ణయాన్ని బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ గౌరవించింది. “జెమీమా ఇప్పుడు క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటోంది. ఆమె భారత్‌లోనే ఉండిపోవాలన్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. మా మద్దతు ఎప్పుడూ జెమీమా, స్మృతి కుటుంబాలకు ఉంటుంది,” అని బ్రిస్బేన్ హీట్ సీఈఓ టెర్రీ స్వెన్సన్ ఒక ప్రకటనలో తెలిపింది.
వృత్తిపరమైన బాధ్యతల కంటే స్నేహానికి విలువిచ్చిన జెమీమా నిర్ణయాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..