
టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా తమ ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీని ఆవిష్కరించింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా కొత్త జెర్సీల్లో తళుక్కున మెరిసిపోతున్నారు. ఇంగ్లండ్ తో ఇటీవలె ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ధరించిన జెర్సీనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ధరించబోతుంది. జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ లోగోతో కొత్త జెర్సీని విడుదల చేశారు. అలాగే ఐసీసీ ప్రధాన టోర్నీల్లో జెర్సీపై కేవలం దేశం పేరు మాత్రమే ఉంటుంది స్పాన్సర్ పేరును తొలగిస్తారనే విషయం తెలిసిందే. సో అది కూడా చేశారు.
అయితే టీమిండియా జెర్సీపై హోస్టింగ్ కంట్రీగా ఉన్న పాకిస్థాన్ పేరు ఉండదంటూ గతంలో చర్చలు జరిగాయి. కానీ, టీమిండియా ఆటగాళ్లు ధరించిన ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలో ఛాంపియన్స్ ట్రోఫీలోగో కింద పాకిస్థాన్ పేరు కూడా ఉంచారు. దీంతో.. భారత్ చాలా హుందాగా వ్యవహరించిందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ దిగజారినా.. ఇండియా అలా చేయలేదని అంటున్నారు. అందుకే ఓ కారణం ఉంది. అదేంటంటే.. పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే స్టేడియాలపై ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని దేశాల జెండాలు ఉంచారు.
కానీ, ఒక్క భారత జాతీయ జెండాను ఉంచలేదు. లాహోర్‌లోని గడాఫీ క్రికెట్ స్టేడియంపై భారత జాతీయ పతాకం లేదంటూ కొన్ని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే తొలి మ్యాచ్ జరగబోతున్న కరాచీ స్టేడియంలో కూడా భారత జెండాను ఏర్పాటు చేయలేదు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డ్ స్పందిస్తూ.. రూల్స్ ప్రకారం ఐసీసీ ఫ్లాగ్, హాస్టింగ్ కంట్రీ ఫ్లాగ్‌తో పాటు ఆ స్టేడియంలో మ్యాచ్ ఆడే రెండు దేశాల జెండాలు ఉంచితే చాలాని అందుకే కరాచీ స్టేడియంపై ఐసీసీ ఫ్లాగ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ఫ్లాగ్ పెట్టినట్లు చెప్పారు.
కానీ, గడాఫీ స్టేడియంపై మాత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేశారు. అక్కడ దేశాల జెండాలు పెట్టి భారత జెండా ఎందుకు పెట్టలేదో మాత్రం పీసీబీ చెప్పలేదు. దీంతో కావాలనే కుళ్లుతో భారత జాతీయ జెండాను ఏర్పాటు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇండియా, పాక్‌కు వెళ్లలేదు కాబట్టి జెండా పెట్టలేదని కొందరు అంటున్నారు, మరి ఇండియా మ్యాచ్‌లు పాక్‌లో ఆడట్లేదు, అలాగని జెర్సీపై పాక్ పేరు తొలగించలేదు. ఒక వేళ పాక్ పేరు లేకుండా ఆడినా టీమిండియాను ఆపేవాడు ప్రపంచంలోనే లేడు. అయినా కూడా బీసీసీఐ ఎంతో హుందాగా వ్యవహరించిందని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.