తగ్గేదేలే.! ఆకాశమే హద్దుగా ‘స్కై’ టీ20ల్లో దంచికొట్టుడు.. దెబ్బకు పాక్ కెప్టెన్ రికార్డు బ్రేక్..

|

Nov 21, 2022 | 10:08 AM

టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఆడింది కేవలం 41 మ్యాచ్‌లే.. అయినప్పటికీ ర్యాంకింగ్‌లో అగ్రస్థానం చేరుకున్నాడు.

తగ్గేదేలే.! ఆకాశమే హద్దుగా స్కై టీ20ల్లో దంచికొట్టుడు.. దెబ్బకు పాక్ కెప్టెన్ రికార్డు బ్రేక్..
Suryakumar Yadav
Follow us on

టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఆడింది కేవలం 41 మ్యాచ్‌లే.. అయినప్పటికీ ర్యాంకింగ్‌లో అగ్రస్థానం చేరుకున్నాడు. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో స్కై 51 బంతుల్లో 111 పరుగులు సాధించి అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. స్కైకి ఇది రెండో టీ20 శతకం కాగా.. దీనితో అతడు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

  • క్యాలెండర్ ఇయర్‌లో రెండు శతకాలు కొట్టిన రెండో టీమిండియా బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ రికార్డు సమం చేయడమే కాదు.. కివీస్ గడ్డపై టీ20లలో తొలి శతకం బాదిన ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
  • ఓ క్యాలెండర్ ఇయర్‌లో టీ20లలోఅత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్(11) రెండో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(10)ను అధిగమించాడు. ఈ జాబితాలో మహ్మద్‌ రిజ్వాన్‌(13) అగ్రస్థానంలో ఉన్నాడు.
  • టీ20ల్లో ఇండియా తరపున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ రికార్డును సమం చేశాడు. రాహుల్‌ 72 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు చేయగా, సూర్యకుమార్‌ 41 మ్యాచ్‌ల్లోనే 2 శతకాలు బాదాడు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ(4) అగ్రస్థానంలో ఉన్నాడు.
  • ఓ టీమిండియా బ్యాటర్ విదేశీ గడ్డపై రెండు శతకాలు నమోదు చేయడం ఓ రికార్డు. అది సూర్యకుమార్ యాదవ్ చేశాడు. మొదటిది ఇంగ్లాండ్‌పై నాటింగ్‌హ‌మ్‌లో చేయగా.. రెండోది న్యూజిలాండ్‌లో చేశాడు.

కాగా, ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. సూర్యకుమార్‌ సెంచరీతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో భాగంగా బరిలోకి దిగిన కివీస్.. దీపక్‌ హుడా(4/10), చాహల్(2/26), సిరాజ్‌(2/24), సుందర్‌(1/24), భువనేశ్వర్‌(1/12) ధాటికి 18.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై పరాజయాన్ని చవిచూసింది.