
Chad Laycock 5 wickets in One Over: చాడ్ లెకాక్ (Chad Laycock) దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఒకే ఓవర్లో ఏకంగా ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. మంగళవారం పీటర్మారిట్జ్బర్గ్లో జరిగిన సీఎస్ఏ ప్రో20 కప్ (CSA Pro20 Cup) మ్యాచ్లో కేజెడ్ఎన్ ఇన్ ల్యాండ్ తరపున టైటాన్స్ పై లెకాక్ ఈ ఘనత సాధించాడు. లెకాక్ ఈ మ్యాచ్లో కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. మొత్తం 6 వికెట్లు తీసి 26 పరుగులు ఇచ్చాడు. ఇందులో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీయడం కూడా ఉంది. దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్లో ఇది మరో రికార్డుగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పూర్తి సభ్య దేశాల ఆటగాళ్లలో లసిత్ మలింగ, రషీద్ ఖాన్, కర్టిస్ క్యాంఫర్, జేసన్ హోల్డర్ గతంలో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు సాధించారు.
అంతేకాదు, సీఎస్ఏ ప్రో20 కప్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కూడా లెకాక్ నమోదు చేశాడు. 2014లో బ్యూరన్ హెండ్రిక్స్ (Beuran Hendricks) సాధించిన 6/29 రికార్డును అధిగమించి, 6/26తో కొత్త రికార్డు నెలకొల్పాడు.
టైటాన్స్ ఇన్నింగ్స్లో 19వ ఓవర్ ఈ సంచలనానికి వేదికైంది. తొలి బంతికి ల్యూస్ డు ప్లాయ్ (Leus du Plooy)ను లెకాక్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా దయ్యాన్ గలీమ్ (Dayyaan Galiem), అఫివే మ్న్యాండా (Aphiwe Mnyanda), జాంకో స్మిత్ (Janco Smit), ఎసోసా ఐహెవ్బా (Esosa Aihevba)లను పెవిలియన్కు పంపించాడు.
ఈ ఐదు వికెట్లతో టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 4 వికెట్లకు 193 పరుగుల వద్ద ఉన్న టైటాన్స్ చివరకు 204 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు కూడా లెకాక్ తన జట్టుకు తొలి వికెట్ అందించాడు. తొమ్మిదో ఓవర్లో లువాన్-డ్రే ప్రిటోరియస్ (Lhuan-dre Pretorius)ను 36 బంతుల్లో 81 పరుగుల వద్ద ఔట్ చేశాడు. అప్పటికి టైటాన్స్ ఓపెనర్లు కలిసి 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
లెకాక్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ కేజెడ్ఎన్ ఇన్ ల్యాండ్ కు విజయం దక్కలేదు. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినకేజెడ్ఎన్ ఇన్ ల్యాండ్ 6 వికెట్లకు 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. లెకాక్ బ్యాటింగ్లోనూ అజేయంగా 31 పరుగులు చేశాడు. దీంతో కేజెడ్ఎన్ ఇన్ ల్యాండ్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టైటాన్స్ వరుసగా ఆరు మ్యాచ్ల్లో అజేయంగా నిలిచింది.
పురుషుల టీ20 క్రికెట్లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లెకాక్ నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అతనికంటే ముందు బంగ్లాదేశ్కు చెందిన అల్-అమీన్ హొస్సేన్ (Al-Amin Hossain), భారత్కు చెందిన అభిమన్యు మిథున్ (Abhimanyu Mithun), ఇండోనేషియాకు చెందిన గెడే ప్రియాందానా (Gede Priandana) ఈ ఘనత సాధించారు.
వీరిలో ప్రియాందానా ప్రత్యేక రికార్డు కూడా కలిగి ఉన్నాడు. 2025 డిసెంబర్లో కంబోడియాతో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసిన ఏకైక పురుష లేదా మహిళా బౌలర్గా అతను నిలిచాడు.
అల్-అమీన్ హొస్సేన్ 2013-14 విక్టరీ డే టీ20 కప్ లో యూసీబీ బీసీబీ XI తరపున అబహాని లిమిటెడ్ పై ఈ ఘనత సాధించాడు. అభిమన్యు మిథున్ 2019-20 సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) సెమీఫైనల్లో కర్ణాటక తరపున హర్యానాపై ఐదు వికెట్లు తీసి ఈ జాబితాలో చేరాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..