Shubman Gill : రికార్డుల మోత మోగించిన శుభమన్ గిల్‎కు విచిత్రమైన బహుమతి..ఏంటో ఈ ఇంగ్లాండ్ సంప్రదాయం

శుభమన్ గిల్ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీతో మెరిసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, అతనికి రూ.21,000 విలువైన మద్యం బాటిల్ బహుమతిగా లభించడం చర్చనీయాంశంగా మారింది. రెండో టెస్టు ఎన్నో రకాలుగా గిల్ కు ప్రత్యేకంగా నిలిచింది.

Shubman Gill : రికార్డుల మోత మోగించిన శుభమన్ గిల్‎కు విచిత్రమైన బహుమతి..ఏంటో ఈ ఇంగ్లాండ్ సంప్రదాయం
Shubman Gill

Updated on: Jul 07, 2025 | 3:17 PM

Shubman Gill : భారత క్రికెట్ యువ సంచలనం శుభమన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ చేసి మెరుపులు మెరిపించాడు. ఈ అద్భుతమైన ఆటతీరుకు గాను తనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. అయితే, సాధారణంగా ఇండియాలో అద్భుతంగా ఆడిన వారికి స్పాన్సర్లు పెద్ద మొత్తంలో డబ్బు చెక్కులు ఇస్తారు. కానీ, ఇంగ్లాండ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా మద్యం లేదా షాంపేన్ బాటిళ్లను బహుమతిగా ఇస్తారు. శుభమన్ గిల్‌కు కూడా అదే ఇచ్చారు. అయితే అతనికి లభించిన మద్యం బాటిల్ ధర రూ.21,000 పైగా ఉండడం ఆశ్చర్యకరమైన విషయం.

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో శుభమన్ గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. అంటే, ఈ టెస్టులో అతను మొత్తం 430 పరుగులతో టీమిండియా భారీ స్కోర్ చేయడానికి సాయపడ్డాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా భారత్ ఇంగ్లాండ్‌ను 336 పరుగుల తేడాతో ఓడించింది. గిల్ ఆటను క్రికెట్ నిపుణులు కూడా ప్రశంసించారు. అతడిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సెలక్ట్ చేశారు. గిల్‌కు మెడల్ తో పాటు, ఒక మద్యం బాటిల్ కూడా బహుమతిగా వచ్చింది. ఇది ఇంగ్లాండ్ అవార్డు గెలుచుకున్న వైన్ అని, దీని ధర భారత కరెన్సీలో రూ.21,000 కంటే ఎక్కువ ఉంటుందని తెలిసింది.

శుభమన్ గిల్‌కు ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ రికార్డుల నెలవుగా నిలిచింది. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ తన సెంచరీ, డబుల్ సెంచరీతో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఒకే టెస్టులో 430 పరుగులు, వన్డేలో 208 పరుగులు, టీ20లో 126 పరుగులు చేసిన క్రికెట్ చరిత్రలో ఏకైక ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతేకాకుండా ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా శుభమన్ గిల్ నిలిచాడు. కెప్టెన్‌గా శుభమాన్ గిల్ చేసిన 269 పరుగుల ఇన్నింగ్స్ ఒక భారతీయ కెప్టెన్‌కు ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్. ఒకే టెస్టులో 250, 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. స్పష్టంగా, గిల్‌కు రెండో టెస్టు చాలా విధాలుగా స్పెషల్ అనే చెప్పాలి. ఇప్పుడు లార్డ్స్ టెస్టులో కూడా గిల్ నుంచి ఆయన అభిమానులు మరో మంచి ప్రదర్శన ఆశిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..