
Shreyas Iyer Toss Record: భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు నమోదైంది. టీమిండియా కొత్త టీ20 సారథి శ్రేయాస్ అయ్యర్ అదృష్టం పండించుకుంటూ టాస్ విషయంలో సరికొత్త సంచలనం సృష్టించారు. అయితే మైదానంలో మాత్రం జట్టు ఫలితాలు అభిమానులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. క్రికెట్ ఆటలో టాస్ గెలవడం అనేది అదృష్టంతో కూడుకున్న పని. అలాంటిది కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుసగా ఐదు మ్యాచ్‌లలో టాస్ గెలిచి, భారత క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి పురుషుల జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గతనెలలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌లలోనూ.. ఇలా వరుసగా ఐదు వన్డే లేదా టీ20 మ్యాచ్‌లలో టాస్ గెలిచిన ఏకైక భారతీయ కెప్టెన్‌గా 31 ఏళ్ల అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన అయ్యర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
ఈ అరుదైన టాస్ రికార్డు ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తున్నా, మరోవైపు జట్టు ప్రదర్శన మాత్రం అత్యంత నిరాశాజనకంగా సాగుతోంది. టాస్ అదృష్టం పూర్తిగా కలిసివస్తున్నప్పటికీ, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా విజయాన్ని అందుకోలేకపోయారు. ఐర్లాండ్ చేతిలో ఘోరంగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన భారత్, ఇంగ్లాండ్‌లో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దవగా, రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. భారత్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ బ్యాటర్లు చాలా సులువుగా ఛేదించారు.
వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న భారత్, మూడో టీ20 మ్యాచ్ కోసం జట్టులో ఒక కీలక మార్పు చేసింది. గత మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకుని ఓటమికి కారణమైన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై వేటు పడింది. అతని స్థానంలో వేగంగా బౌలింగ్ చేయగల యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ యువ బౌలర్‌కు అవకాశం కల్పించినట్లు కెప్టెన్ స్పష్టం చేశారు.
భారత తుది జట్టు ఇదే: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్.
టాస్ రూపంలో అదృష్టం తలుపు తడుడుతున్నా, దానిని విజయాలుగా మలచుకోవడంలో టీమిండియా తడబడుతోంది. ఈ క్రమంలో మూడో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోవడంతో, వరుసగా ఐదు టీ20 మ్యాచ్‌లలో ఒక్క విజయం కూడా సాధించని జట్టుగా మరో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 125 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టీ20 క్రికెట్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద ఓటమిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 76 పరుగులకే ఆలౌట్ అయింది, ఇది ఈ ఫార్మాట్‌లో భారత్ చేసిన రెండో అత్యల్ప స్కోరుగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..