శ్రీలంకతో తొలి టెస్ట్.. సుదర్శన్ స్థానంలో గుంటూరోడు.. అసలెవరీ ఆంధ్రా సెన్సేషన్..!
India vs Sri Lanka Test Series 2026: తెలుగు కుర్రాడు షేక్ రషీద్‌కు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కితే ఆయన కెరీర్‌లో ఇది అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోతుంది. సాయి సుదర్శన్ స్థానాన్ని భర్తీ చేసే ఆ అదృష్టవంతుడు ఎవరో మరికొద్ది గంటల్లో తేలనుంది.

India vs Sri Lanka Test Series 2026: ఆగస్టు 15 నుంచి గాల్ వేదికగా శ్రీలంకతో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ ముందే టీమిండియాలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్టార్ ఓపెనర్ బి. సాయి సుదర్శన్ బొటనవేలి గాయం వల్ల సిరీస్ నుంచి తప్పుకోవడంతో, ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ యంగ్ క్రికెటర్ షేక్ రషీద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. మోకాలి వాపు సమస్యతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే సిరీస్‌కు దూరమవగా ఆయన స్థానంలో ఆకిబ్ నబీ జట్టులోకి వచ్చారు. తాజాగా ఎడమచేతి బొటనవేలి తీవ్రమైన గాయం వల్ల యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి కొన్ని రోజులే సమయం ఉండటంతో, ఆయన స్థానంలో ఎవరిని స్క్వాడ్‌కు ఎంపిక చేయాలనే దానిపై బిసిసిఐ సెలెక్టర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
ఎక్కువమంది చదివినది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?
రేసులో ఆంధ్ర కుర్రాడు.. రేపే బెంగళూరులో రిపోర్ట్..
ఈ భర్తీ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల యంగ్ బ్యాటర్ షేక్ రషీద్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఇటీవల శ్రీలంకలో ముగిసిన ఇండియా ‘ఎ’ షాడో టూర్ లో షేక్ రషీద్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో సెలెక్టర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయానికల్లా బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ) వద్ద రిపోర్ట్ చేయాలని బోర్డు రషీద్‌ను ఆదేశించింది. కోచ్‌ల నుంచి లభించిన అత్యుత్తమ ఫీడ్‌బ్యాక్ దృష్ట్యా రషీద్‌కే టీమిండియా టెస్ట్ పిలుపు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పోటీలో ముంబై డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్..
తెలుగు కుర్రాడు రషీద్‌తో పాటు ముంబై రంజీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా సెలెక్టర్ల పరిశీలనలో ఉంది. గత వారం రోజులుగా సర్ఫరాజ్ ఖాన్ బెంగళూరులోనే ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరవుతున్నారు. స్పిన్ బౌలింగ్‌ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం ఉండటంతో పాటు, దేశవాళీ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీల రికార్డు ఆయన సొంతం. అంతేకాకుండా భారత్ తరఫున అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా సర్ఫరాజ్‌కు అదనపు బలంగా మారింది.
ఎక్కువమంది చదివినది: ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..!
రెండు రోజుల్లో బీసీసీఐ అధికారిక ప్రకటన..
శ్రీలంక పిచ్‌లపై స్పిన్నర్లను తట్టుకుని నిలబడే నాణ్యమైన బ్యాటర్ కావడంతో సర్ఫరాజ్, రషీద్ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే యంగ్ రక్తం వైపే మొగ్గు చూపే ఆలోచనలో సెలెక్షన్ కమిటీ ఉన్నట్లు సమాచారం. రషీద్ లేదా సర్ఫరాజ్ ఇద్దరిలో ఎవరిని శ్రీలంకకు విమానం ఎక్కిస్తారో బిసిసిఐ మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై ఇటు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



