
Sanju Samson : ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును గాయాల బెడద అస్సలు వదలడం లేదు. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి టోర్నీకి దూరం కాగా, ఇప్పుడు ఆ లిస్టులోకి టీమ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా చేరిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ శాంసన్ వేలికి తీవ్ర గాయమైంది. క్రీజులోనే నొప్పితో విలవిలలాడిపోయిన సంజూ, ఆ తర్వాత మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ ఘటనతో సీఎస్‌కే యాజమాన్యం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది.
గుజరాత్ మ్యాచ్‌లో అసలేం జరిగిందంటే..?
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. సీఎస్‌కే బౌలర్ స్పెన్సర్ జాన్సన్ వేసిన రెండో ఓవర్‌లో లెగ్ సైడ్ వచ్చిన ఒక షార్ట్ లెంగ్త్ బంతిని అందుకోవడానికి సంజూ శాంసన్ ప్రయత్నించాడు. అయితే, గంటకు 144 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి ఊహించని విధంగా స్వింగ్ అయింది. దానిని అంచనా వేయడంలో పొరబడిన సంజూ చేతికి బంతి బలంగా తగిలింది. ముఖ్యంగా అతని ఎడమ చేతి చిటికెన వేలికి బంతి నేరుగా తాకడంతో సంజూ తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. వెంటనే జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ నొప్పు తగ్గకపోవడంతో సంజూ శాంసన్ కీపింగ్ వదిలేసి పెవిలియన్ వైపు నడిచాడు. సంజూ స్థానంలో ఉర్విల్ పటేల్ ప్రత్యామ్నాయ కీపర్‌గా బాధ్యతలు చేపట్టాడు.
గాయాల గుప్పిట్లో చెన్నై సూపర్ కింగ్స్
ఈ సీజన్ ప్రారంభం నుంచి చెన్నై జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటికే ఎంఎస్ ధోనీ, నాథన్ ఎల్లిస్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు రకరకాల గాయాల వల్ల ఇబ్బందులు పడ్డారు. కొందరు టోర్నమెంట్ మొత్తానికే దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలో జట్టును ఆదుకుంటాడనుకున్న సంజూ శాంసన్ కూడా గాయపడటం చెన్నై క్యాంప్‌లో గుబులు రేపుతోంది. వికెట్ కీపింగ్ చేస్తూ వేలికి దెబ్బ తగలడం అనేది ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
బ్యాటింగ్‌కు వస్తాడా?
ప్రస్తుతం చెన్నై జట్టు ఫిజియోల పర్యవేక్షణలో సంజూ శాంసన్‌కు చికిత్స అందుతోంది. వేలి గాయంతో కీపింగ్ చేయడం కష్టమే అయినప్పటికీ, బ్యాటింగ్ చేయడానికి కొంతవరకు అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. చెన్నై జట్టు బ్యాటింగ్ ప్రారంభించడానికి ఇంకా సమయం ఉండటంతో, కీలకమైన ఈ రన్ చేజ్‌లో సంజూ శాంసన్ పెయిన్ కిల్లర్స్ వేసుకుని అయినా బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సంజూ బ్యాటింగ్‌కు రాకపోతే అది చెన్నై విజయ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..