
MS Dhoni: ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలికాడు. 19 ఏళ్ల పాటు అభిమానులను అలరించిన ఈ దిగ్గజం ఇకపై చెన్నై సూపర్ కింగ్స్‌కు మార్గదర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ధోనీ నిర్ణయంపై క్రికెట్ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ధోనీలోని అసాధారణ బ్యాటింగ్ ప్రతిభను తాను చాలా ముందే గుర్తించానని, అప్పట్లో సౌరవ్ గంగూలీతో కూడా ఈ విషయం చెప్పానని సచిన్ గుర్తుచేసుకున్నారు.
బంగ్లాదేశ్‌లోనే ధోనీలోని ప్రత్యేకత గుర్తించా
ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో సచిన్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశం పంచుకున్నారు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తొలినాళ్లలో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా అతడి బ్యాటింగ్‌ను చూశానని తెలిపారు. ఆ సమయంలోనే ధోనీ బంతిని బలంగా బాదే విధానంలో ఏదో ప్రత్యేకత ఉందని గుర్తించానన్నారు. ఈ విషయాన్ని అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీతో కూడా చెప్పినట్లు వెల్లడించారు. ధోనీలో అరుదైన ప్రతిభ ఉందని అప్పుడే అనిపించిందని, ఆ తర్వాత అతడి ప్రయాణం అద్భుతంగా సాగిందని సచిన్ ప్రశంసించారు.
కలిసి ఆడిన రోజులు గుర్తుకొస్తున్నాయి
ధోనీతో కలిసి భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సచిన్ పేర్కొన్నారు. భారత క్రికెట్‌లో ఎన్నో మరపురాని విజయాల్లో ఇద్దరం భాగస్వాములమయ్యామని గుర్తుచేసుకున్నారు. ధోనీ ఏదో ఒక రోజు గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని తనకు మొదటి నుంచీ నమ్మకం ఉందని, అయితే అతడు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ సాధించాడని కొనియాడారు. భారత క్రికెట్‌కు ధోనీ తన శక్తినంతా ధారపోశాడని పేర్కొంటూ.. బాగా ఆడావు ధోనీ అంటూ తన మెసేజ్ ముగించారు.
19 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణానికి ముగింపు
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ ఈ పోటీల్లో భాగంగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 సీజన్లు ఆడాడు. 2016, 2017లో చెన్నై జట్టుపై నిషేధం ఉండటంతో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున బరిలోకి దిగాడు. 2018లో చెన్నై జట్టులోకి తిరిగి వచ్చి తొలి సీజన్‌లోనే టైటిల్ అందించాడు. అతడి నాయకత్వంలో చెన్నై 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ కప్ గెలిచింది. 2010, 2014లో రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్ కూడా సాధించింది.
ఇకపై చెన్నై జట్టుకు మార్గదర్శకుడిగా ధోనీ
2024 సీజన్‌కు ముందు ధోనీ కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. ఆ తర్వాత కూడా వికెట్ కీపర్, బ్యాటర్‌గా జట్టుకు సేవలందించాడు. 2025 మే 25న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ అతడికి చివరి ఐపీఎల్ మ్యాచ్‌గా నిలిచింది. 2026 సీజన్‌లో కాలి కండరాల గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. మొత్తం 278 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5,439 పరుగులు చేశాడు. 38.30 సగటు, 137.45 స్ట్రైక్ రేట్‌తో పాటు 24 అర్ధసెంచరీలు, 264 సిక్సర్లు సాధించాడు. ఇప్పుడు 2027 సీజన్ నుంచి చెన్నై జట్టుకు మార్గదర్శకుడిగా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. జట్టు ప్రధాన కోచ్‌గా జహీర్ ఖాన్ వ్యవహరించనున్న నేపథ్యంలో ధోనీ అనుభవం యువ ఆటగాళ్లకు ఉపయోగపడుతుందని చెన్నై యాజమాన్యం భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..