IND vs SL: వీడు కచ్చితంగా మరో సచిన్ టెండూల్కరే.. బీసీసీఐ ఉపాధ్యక్షుడి మనసు దొచిన లంక ప్లేయర్

IND vs SL: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష సృష్టిస్తున్న విధ్వంసం ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఒత్తిడిలోనూ అద్భుత శతకాలతో విరుచుకుపడుతున్న ఈ లంక కుర్రాడి ఆటతీరును చూసి బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ముచ్చటపడి, ఏకంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో పోల్చడం విశేషం.

IND vs SL: వీడు కచ్చితంగా మరో సచిన్ టెండూల్కరే.. బీసీసీఐ ఉపాధ్యక్షుడి మనసు దొచిన లంక ప్లేయర్
Rajeev Shukla

Updated on: Aug 27, 2026 | 6:21 PM

IND vs SL: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పింది. మైదానంలో టీమిండియా బౌలర్ల ధాటికి శ్రీలంక వరుస వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడ్డ ప్రతిసారీ దినుష కొండంత అండగా నిలిచాడు. సిరీస్ మొదటి టెస్టులో కెరీర్‌లో తొలి శతకం నమోదు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, కొలంబోలో జరిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కేవలం 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పకడ్బందీ ఓటమి వైపు పయనిస్తున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన దినుష, భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగాడు.

దినుష చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని జయించే తీరు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, శ్రీలంకకు చెందిన ఈ సోనల్ నిజంగానే ఒక అద్భుతమైన ఆటగాడని కొనియాడారు. ఆయన ఆటతీరు చూస్తుంటే సాక్షాత్తూ సచిన్ టెండూల్కరే గుర్తుకొస్తున్నాడని, అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం నిలిచే అద్భుతమైన టెస్టు ఆటగాడిగా మారే సత్తా ఆయనలో ఉందని రాజీవ్ శుక్లా ట్వీట్ చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలిలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఒక ప్రత్యర్థి జట్టు కుర్రాడిని ఈ స్థాయిలో ప్రశంసించడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

క్రికెట్ ప్రపంచంలో ఎవరైనా యువ ఆటగాడిని సచిన్ టెండూల్కర్‌తో పోల్చడం అత్యున్నత గౌరవంగా భావిస్తారు. రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన సచిన్ స్థాయిలో నిలవడం ఏ ఆటగాడికైనా సవాలుతో కూడుకున్న విషయమే. సోనల్ దినుష ఇప్పుడు తన టెస్టు కెరీర్ ప్రారంభ దశలోనే ఉన్నాడు. భారత్ లాంటి ప్రపంచ స్థాయి జట్టుపై ఒకే సిరీస్‌లో 3 శతకాలు సాధించడం మామూలు విషయం కాకపోయినా, రాబోయే కాలంలో ఈ నిలకడను ఇలాగే కొనసాగించడమే ఆయన ముందున్న అసలైన పరీక్ష.

దిగువ వరుసలో బ్యాటింగ్‌కు వచ్చి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే నైపుణ్యం శ్రీలంక జట్టుకు చాన్నాళ్ళ తర్వాత లభించింది. టెయిలెండర్లను వెంటబెట్టుకుని భారత వేగవంతమైన, స్పిన్ బౌలింగ్ విభాగాలను సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు ఆయన మానసిక బలాన్ని చాటుతోంది. రాబోయే ఏళ్ళలో దినుష ఇలాగే విరుచుకుపడితే శ్రీలంక క్రికెట్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us