Prithvi Shaw: మరో సచిన్ నుంచి మోసగాడిగా.. పృథ్వీ షా జీవితమే ఒక చదరంగం!

ఒకప్పుడు 'నెక్స్ట్ సచిన్' అని ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా కెరీర్ ఎన్నో మలుపులు తిరిగింది. చిన్న వయసులోనే సంచలనాలు సృష్టించి, భారత జట్టులోకి అడుగుపెట్టినా, నిలకడలేమి, ఫిట్‌నెస్, వివాదాలు అతని పురోగతిని అడ్డుకున్నాయి. ఇటీవల వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలు (ఆకృతి అగర్వాల్ వివాదం) వార్తల్లో నిలిచాయి.

Prithvi Shaw: మరో సచిన్ నుంచి మోసగాడిగా.. పృథ్వీ షా జీవితమే ఒక చదరంగం!
Prithvi Shaw Akriti Agarwal

Updated on: Jul 06, 2026 | 12:21 PM

పృథీ షా.. టీమిండియాకు పెద్దగా ఆడకపోయినా ఈ పేరు క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. చిన్న వయసు నుంచే క్రికెట్‌లో సంచలనాలు స‌ృష్టిస్తూ.. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి.. నెక్ట్స్ సచిన్ అనే పేరు సంపాదించుకున్నాడు. కానీ.. విధి విచిత్రమైంది. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా.. క్రికెట్ ప్రపంచం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేక.. నేడు ఒక మోసగాడు అనే నిందను మోసే స్థాయికి పడిపోయాడు. అసలు పృథీ షా లైఫ్ ఎలా మొదలైంది.. ఎలా సాగింగి.. ఇప్పుడు ఎలా ఉంది. కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన పృథ్వీ షా ప్రయాణం ఆశ్చర్యకరమైన మలుపులతో సాగింది. చిన్న వయసులోనే రికార్డులు బద్దలు కొట్టి, భారత జట్టులోకి మెరుపు వేగంతో ప్రవేశించిన షా.. ప్రస్తుతం మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పెట్టుకునేందుకు కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో పృథ్వీ షా, అతని కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చాయని, వీరిద్దరూ తమ బంధానికి స్వస్తి పలికారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమన్నాయి. ఈ ఏడాది మార్చిలోనే ఎంతో ఘనంగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగిన కేవలం నాలుగు నెలల్లోనే.. తాను మోసపోయాను అంటూ ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు పెట్టడంతో, అది పృథ్వీ షాను ఉద్దేశించే అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇంకా దీనిపై షా స్పందించలేదు.

Prithvi Shaw Next Sachin

చిన్న వయసు నుంచే..

1999 నవంబర్ 9న మహారాష్ట్రలోని థానేలో జన్మించిన పృథ్వీ షా చిన్నతనం నుంచే అసాధారణ బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించాడు. అతని తండ్రి పంకజ్ షా ప్రోత్సాహంతో క్రికెట్‌లో అడుగుపెట్టిన పృథ్వీ, పాఠశాల స్థాయి నుంచే సంచలన ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచాడు. 2013లో హారిస్ షీల్డ్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో 546 పరుగులు చేసి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. 2018లో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన షా, జట్టును ప్రపంచకప్ విజేతగా నిలిపాడు. అదే ఏడాది భారత టెస్టు జట్టులోకి ఎంపికై, వెస్టిండీస్‌పై అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకం సాధించాడు. తొలి టెస్టులోనే సెంచరీ చేసిన అతి పిన్న వయస్కులైన భారత ఆటగాళ్లలో ఒకడిగా నిలిచి తనపై ఉన్న అంచనాలను మరింత పెంచాడు.

టెస్టులతో పాటు వన్డే, టీ20 జట్లలో కూడా అవకాశం దక్కించుకున్న షా, తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ అనేక కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై ఎటాక్ చేయడంలో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, ప్రారంభ విజయాల తర్వాత షా కెరీర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఫిట్‌నెస్ సమస్యలు, నిలకడలేని ఫామ్, సాంకేతిక లోపాలు, క్రమశిక్షణకు సంబంధించిన విమర్శలు అతని పురోగతిని దెబ్బతీశాయి. కొన్ని సందర్భాల్లో జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. దేశవాళీ క్రికెట్‌లో భారీ పరుగులు చేసినప్పటికీ, జాతీయ జట్టులో స్థిరమైన స్థానం మాత్రం సంపాదించలేకపోయాడు.

అయినా పృథ్వీ షా ప్రతిభపై క్రికెట్ నిపుణులకు ఇప్పటికీ నమ్మకం ఉంది. సరైన ఫిట్‌నెస్, క్రమశిక్షణ, నిలకడైన ప్రదర్శన ఉంటే అతను మళ్లీ భారత జట్టులో కీలక ఆటగాడిగా మారే సామర్థ్యం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. దేశవాళీ టోర్నీలు, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనతో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలని షా కృషి చేస్తున్నాడు.

వివాదాలతో సహవాసం..

వ్యక్తిగత జీవితంలో కూడా పృథ్వీ షా పలుమార్లు వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియా వివాదాలు, అభిమానులతో జరిగిన సంఘటనలు, గాయాలు అతని కెరీర్‌పై ప్రభావం చూపాయి. అయినప్పటికీ వాటిని అధిగమించి క్రికెట్‌పైనే దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం పృథ్వీ షా లక్ష్యం ఒక్కటే, మళ్లీ భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించడం. అతని వయస్సు ఇంకా తక్కువే కావడంతో తిరిగి నిలదొక్కుకునే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. గతంలో చూపిన ప్రతిభను మరోసారి ప్రదర్శించగలిగితే, భారత క్రికెట్‌లో అతనికి మరో స్వర్ణ అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు భారత క్రికెట్‌కు భవిష్యత్తు తారగా ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా.. ఇప్పుడు తన రెండో ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ పునరాగమన ప్రయాణం ఎంత విజయవంతమవుతుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

Follow Us