Sourav Ganguly: గంగూలీని దాదా అని ఎందుకంటారు? రోమాలు నిక్కబొడుచుకునే చరిత్ర అది..

భారత క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభంలో ఉన్నప్పుడు, 'విదేశాల్లో పిల్లి' అనే బిరుదుతో కుంగిపోయిన వేళ, యువ సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టారు. తన దూకుడైన నాయకత్వంతో యువ ఆటగాళ్లను ప్రోత్సహించి, జట్టులో గెలుపు తపనను నింపారు. భారత క్రికెట్‌కు కొత్త దిశను చూపించి, 'దాదా'గా మారిన ఆయన ప్రస్థానం అద్భుతం.

Sourav Ganguly: గంగూలీని దాదా అని ఎందుకంటారు? రోమాలు నిక్కబొడుచుకునే చరిత్ర అది..
Sourav Ganguly

Updated on: Jul 08, 2026 | 1:21 PM

ఇండియన్ క్రికెట్ టీమ్ అప్పటికే వరల్డ్ కప్ గెలిచి ఉన్నా.. అదో సాధారణ టీమ్ అనే అలుసు మిగతా టీమ్స్‌కి. టీమిండియానా.. వాళ్లు స్వదేశంలో పులి, విదేశాల్లో పిల్లి అనే బిరుదులు కూడా ఉండేవి. సచిన్ లాంటి దిగ్గజం జట్టులో ఉన్నా.. పసికూనకు ఎక్కువ, పెద్ద టీమ్‌కు తక్కువ అనే పరిస్థితి. ఇదంతా సరిపోదు అన్నట్లు.. జట్టులో ఫిక్సింగ్ కలకలం. అప్పటి టీమిండియా కెప్టెన్ అజహరుద్దీన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో భారత క్రికెట్ ప్రతిష్ఠ ఒక్కసారిగా దిగజారిపోయింది. జట్టులో తెలియని నైరాష్యం, అసలు గెలవాలనే తపనే కనిపించేది కాదు. ఆల్ మోస్ట్ వెంటిలేటర్‌పైకి వెళ్లింది ఇండియన్ క్రికెట్.

అదిగో అలాంటి టైమ్‌లో వచ్చాడు ఓ యువకుడు. చూసేందుకు అచ్చం సినిమా హీరోలా ఉండేవాడు. కళ్లు మిటకరిస్తూ, ముందుకొచ్చి సిక్సులు కొట్టే బ్యాటర్‌‌గా అప్పటి వరకు అతని గురించి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ.. అతనిలోని ఒక లీడర్ ఉన్నాడని, అతనే టీమిండియా తలరాత మార్చబోతున్నాడని చాలా మందికి అప్పటికీ తెలియదు. ఫిక్సింగ్ ఆరోపణలతో టీమిండియా అంటే బండిని లాగేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సచిన్ కూడా నావల్ల కాదని చేతులు ఎత్తేశాడు. అప్పుడు సౌరవ్ గంగూలీ అనే ఒక యవతేజం ఆ బాధ్యత తీసుకున్నాడు. అప్పటి వరకు గంగూలీగా ఉన్న అతను.. కెప్టెన్ అయ్యాక లోడ్ చేసిన గన్‌లా మారాడు. అయితే గంగూలీగా మొదలైన అతని ప్రస్థానం.. ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా, గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్ నుంచి.. దాదాగా ఎలా మారిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1992లో డెబ్యూ..

1992 జనవరి 11న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గంగూలీకి ఆరంభం అంత గొప్పగా లభించలేదు. ఆ తర్వాత నాలుగేళ్లకు వచ్చిన అవకాశం ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. 1996 జూన్ 20న ఇంగ్లాండ్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టు అరంగేట్రం చేసిన గంగూలీ తొలి మ్యాచ్‌లోనే 131 పరుగులు చేసి సెంచరీతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఆ వెంటనే ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన రెండో టెస్టులో 136 పరుగులు చేసి వరుసగా తొలి రెండు టెస్టుల్లోనే సెంచరీలు చేసిన అరుదైన భారత క్రికెటర్‌గా నిలిచాడు.

కెప్టెన్సీ పగ్గాలు..

2000లో భారత క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాలతో కుదేలైన సమయంలో జట్టు పగ్గాలు చేపట్టిన గంగూలీ, భారత జట్టుకు కొత్త దిశను చూపించాడు. విదేశాల్లో గెలవాలనే ఆత్మవిశ్వాసాన్ని ఆటగాళ్లలో నింపడమే కాకుండా, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించి భవిష్యత్ భారత జట్టుకు బలమైన పునాది వేశాడు. 2001లో ఆస్ట్రేలియాపై జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ విజయం భారత క్రికెట్‌లో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. అలాగే 2002 జూలై 13న లార్డ్స్‌లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయాన్ని అందుకున్న తర్వాత బాల్కనీలో టీ-షర్ట్‌ను గాల్లో ఊపుతూ చేసిన సెలబ్రేషన్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటిగా నిలిచింది.

ఇది కూడా చదవండి: క్రికెట్ దేవుడినే భయపెట్టిన బౌలర్..! వార్న్, మెక్‌గ్రాత్, అలెన్, అక్రమ్ కానే కాదు..

ఆ క్షణం నుంచి గంగూలీని దాదా.. దాదా.. అని పిలవడం ఎక్కువైంది. నిజానికి కోల్‌కత్తాలో దాదా అనే పిలుపు కామన్. మన దగ్గర అన్న అని ఎలా పిలుస్తామో అక్కడ అలా పిలుస్తారు. కానీ, గంగూలీని అలా పిలవడానికి అదొక్కటే కారణం కాదు. గెలుపు కోసం ఏమైనా చేసే అతని మొండితనం, తనకు కావాల్సిన టీమ్ కోసం సెలెక్టర్లతో, బీసీసీఐతో అతను చేసే ఫైట్, గ్రౌండ్‌లో ప్రత్యర్థి జట్టు ఒక్క మాట అంటే పది అనేలా జట్టును తయారు చేసిన తీరు, ప్రపంచంలో ఏ టీమ్‌కి, ఏ ప్లేయర్‌కి కూడా భయపడని నైతం.. గంగూలీని దాదాని చేసింది. అసలు స్లెడ్జింగ్ అంటే ఏంటో తెలియని టీమిండియాకు దూకుడు నేర్పి, విదేశాల్లో గెలవడం నేర్పి.. మొత్తంగా ఒక తిరుగులేని శక్తిగా మర్చాడు దాదా.

ఎన్నో ఘనతలు..

కేవలం జట్టులో దూకుడే కాదు.. గంగూలీ నాయకత్వంలో భారత్ 2003 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకోవడం మరో చారిత్రక ఘట్టం. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా, భారత జట్టును ప్రపంచ వేదికపై మళ్లీ బలమైన జట్టుగా నిలబెట్టడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైంది. 2007 నవంబర్ 15న వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న గంగూలీ, 2008 అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అదే ఏడాది నవంబర్ 9 నుంచి 13 వరకు నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ ఆయన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. తన కెరీర్‌లో 113 టెస్టులు ఆడి 7,212 పరుగులు, 311 వన్డేలు ఆడి 11,363 పరుగులు చేసిన గంగూలీ 16 టెస్టు, 22 వన్డే సెంచరీలు నమోదు చేశాడు. ఆటగాడిగా మాత్రమే కాకుండా, తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడిగా కూడా సేవలందిస్తూ భారత క్రికెట్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు. దూకుడైన నాయకత్వం, యువ ఆటగాళ్లపై నమ్మకం, విజయాల పట్ల ఆకలి… ఈ మూడు లక్షణాలే సౌరవ్ గంగూలీని భారత క్రికెట్‌లో ఒక యుగాన్ని సృష్టించిన కెప్టెన్‌గా నిలబెట్టాయి.

Follow Us