AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ దేవుడినే భయపెట్టిన బౌలర్..! వార్న్, మెక్‌గ్రాత్, అలెన్, అక్రమ్ కానే కాదు..

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో అత్యంత కఠినమైన బౌలర్‌గా హాన్సీ క్రోంజేను పేర్కొన్నారు. వేగం లేకపోయినా, క్రోంజే కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, సమయానికి మార్పులతో సచిన్‌ను నిత్యం ఇబ్బంది పెట్టేవాడు. టెస్టుల్లో ఐదుసార్లు ఔట్ చేసిన క్రోంజే, పేస్ కంటే వ్యూహాత్మక బౌలింగ్ గొప్పదని నిరూపించాడు.

క్రికెట్ దేవుడినే భయపెట్టిన బౌలర్..! వార్న్, మెక్‌గ్రాత్, అలెన్, అక్రమ్ కానే కాదు..
Sachin Vs Hansie Cronje
SN Pasha
|

Updated on: Jul 07, 2026 | 3:13 PM

Share

ఎన్ని తరాలు మారినా, ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా, పోయినా.. క్రికెట్ బతికున్నంత కాలం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు సచిన్ టెండూల్కర్. క్రికెట్ కోసమే పుట్టి, బ్యాటింగే ఊపిరిగా బతికిన మనిషి. ఆయన ఇండియాలో పుట్టడం మన అదృష్టం అయితే.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం క్రికెట్ చేసుకున్న పుణ్యం. ఇలా ఎంత చెప్పినా కాస్త కూడా అతిశయోక్తి అనిపించదు. ఎందుకంటే.. సచిన్ ఒక ఆటగాడు కాదు.. క్రికెట్ ఒక మతం అయితే దానికి దేవుడు ఆయనే. ఇది ప్రపంచం మొత్తం ఒప్పుకున్న సత్యం. అయితే అలాంటి సచిన్‌ని ఓ సాధారణ బౌలర్ భయపెట్టేవాడంటే నమ్ముతారా? ఈ మాట ఎవరో చెబితే ప్రపంచం నమ్మేది కాదేమో కానీ, స్వయంగా సచినే చెప్పారు కానుక మనసు ఒప్పుకోకపోయినా నమ్మాల్సి వస్తుంది. ఇంతకీ ఆ బౌలర్ ఎవరో తెలుసా.. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హాన్సీ క్రోంజే. పెద్దగా పేస్ లేకపోయినా.. సచిన్ టెండూల్కర్‌ను ఇబ్బంది పెట్టేవాడు క్రోంజే.

ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది దిగ్గజ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్న సచిన్ తన కెరీర్‌లో తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ వేగవంతమైన పేసర్ కాదని, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రోంజే అని చెప్పడం అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సచిన్ ప్రకారం.. క్రోంజే బౌలింగ్‌లో అసాధారణమైన వేగం లేకపోయినా, అతని మీడియం పేస్, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, సరైన సమయంలో వేయే మార్పులు తన లయను దెబ్బతీసేవి. “ఎందుకో తెలియదు కానీ, నేను బాగా ఆడుతున్న సమయంలో కూడా క్రోంజే బౌలింగ్‌కు ఔట్ అయ్యేవాడిని. అతనిని ఎలా ఎదుర్కోవాలో కొన్ని సందర్భాల్లో నాకు కూడా అర్థం కాలేదు” అని సచిన్ పేర్కొన్నాడు.

ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో క్రోంజే పలుమార్లు సచిన్ వికెట్‌ను పడగొట్టాడు. గణాంకాల ప్రకారం కూడా టెస్టు క్రికెట్‌లో క్రోంజే ఐదుసార్లు సచిన్‌ను ఔట్ చేశాడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్న సచిన్‌కు, పార్ట్‌టైమ్ మీడియం పేసర్‌గా భావించే క్రోంజే మాత్రం ప్రత్యేకమైన సవాలుగా నిలిచాడు. ఒక సందర్భంలో సచిన్ సరదాగా, “డొనాల్డ్ లేదా పోలాక్ బౌలింగ్‌ను నేను చూసుకుంటాను. కానీ క్రోంజే బౌలింగ్ వచ్చినప్పుడు నువ్వే ఎక్కువ స్ట్రైక్ తీసుకో” అని తన బ్యాటింగ్ పార్ట్నర్‌కి చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్య క్రోంజే బౌలింగ్ సచిన్‌పై ఎంత మానసిక ప్రభావం చూపిందో తెలియజేస్తుంది.

మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో క్రోంజే కెరీర్ మసకబారిపోయినా, బౌలర్‌గా అతని తెలివితేటలు, వ్యూహాత్మక బౌలింగ్‌ను సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం బహిరంగంగా ప్రశంసించడం అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. క్రికెట్‌లో గొప్ప బ్యాటర్లను కేవలం వేగం కాదు, తెలివైన బౌలింగ్ కూడా ఇబ్బంది పెట్టగలదని సచిన్-క్రోంజే పోటీ మరోసారి నిరూపించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us