
Pawan Kalyan : దోహా వేదికగా జరిగిన ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ – 2025లో భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం అర్జున్ ఇరిగైసి అద్భుత విజయాన్ని అందుకున్నారు. ప్రపంచ మేధావులతో తలపడి కాంస్య పతకం కైవసం చేసుకున్న అర్జున్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ అర్జున్‌ను అభినందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన అర్జున్ ఇరిగైసిని పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా అభినందించారు. “మీ అద్భుత ప్రదర్శన మీ అంకితభావానికి, స్థిరత్వానికి నిదర్శనం. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక తెలుగు కుర్రాడు ప్రపంచ వేదికపై విశ్వనాథన్ ఆనంద్ తర్వాత పతకం సాధించిన రెండో భారతీయ పురుష క్రీడాకారుడిగా రికార్డు సృష్టించడం గర్వకారణమని క్రీడాభిమానులు పండగ చేసుకుంటున్నారు.
వరంగల్‌కు చెందిన 21 ఏళ్ల అర్జున్ ఇరిగైసి ఈ టోర్నీలో ఆద్యంతం చెలరేగి ఆడాడు. మొత్తం 13 రౌండ్లలో 9.5 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను సైతం డ్రాగా నిలువరించి తన సత్తా చాటాడు. ఈ విజయంతో అర్జున్ లైవ్ రాపిడ్ రేటింగ్‌లో ప్రపంచ నంబర్ 3 స్థానానికి చేరుకోవడం విశేషం. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఫార్మాట్‌లో మెడల్ సాధించిన ఏకైక భారతీయ మెన్ ప్లేయర్‌గా అర్జున్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.
Congratulations to Grand Master @ArjunErigaisi on winning the bronze medal at the FIDE World Rapid Championship. Your performance reflects dedication, composure, and commitment to excellence. Wishing you continued success in all your future tournaments – @PawanKalyan@IPR_AP…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 29, 2025
ఈ టోర్నీలో లెజెండరీ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ తన ఆరో వరల్డ్ రాపిడ్ టైటిల్‌ను గెలుచుకుని తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. అయితే అర్జున్ ఇరిగైసి గట్టి పోటీ ఇచ్చి పోడియంపై నిలవడం భారత చెస్ ఎదుగుదలకు నిదర్శనం. మహిళల విభాగంలోనూ కోనేరు హంపి కాంస్య పతకం సాధించి భారత్ ఖాతాలో రెండో మెడల్ చేర్చింది. మరో ఇద్దరు భారత మహిళా క్రీడాకారిణులు సవితా శ్రీ, వైశాలి కూడా టాప్ 5లో నిలిచి ప్రపంచానికి భారత చెస్ సత్తాను పరిచయం చేశారు.
ఈ కాంస్య పతకంతో అర్జున్ ఇరిగైసి వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగబోయే ప్రతిష్టాత్మక టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టూర్‌కు కూడా అర్హత సాధించారు. తదుపరి జరగబోయే వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా అర్జున్ పతకం సాధిస్తాడని దేశవ్యాప్తంగా క్రీడాకారులు ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి నాయకులు క్రీడాకారులను ప్రోత్సహించడం వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.