పాకిస్థాన్ , ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా 24 గంటల కంటే తక్కువ సమయం ఉంది . అయితే అంతకుముందే.. పాక్ ఆతిథ్యంపై అనుమానాలు వెల్లువెత్తాయి. టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడం పాకిస్థాన్ సురక్షితమేనా అనే ప్రశ్న మొదలైంది. దీనికి కారణం పాకిస్థాన్ నుంచి వస్తున్న వార్తలే. టెస్టు సిరీస్ ప్రారంభానికి ఒకరోజు ముందు పాకిస్థాన్‌లోని క్వెట్టాలో పోలీసు వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ బాంబు పేలుడులో ఒక పోలీసు అధికారి సహా ముగ్గురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
ప్రజలు పాకిస్థాన్‌లో సురక్షితంగా లేనప్పుడు, భద్రతకు గ్యారెంటీ ఎవరు ఇస్తారు. అలానే ఇంగ్లండ్ జట్టును ఎలా కాపాడుతారు? అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఈ భద్రతా సమస్యల కారణంగా పాకిస్థాన్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. అల్ జజీరా ప్రకారం, పాకిస్తాన్‌లో బాంబు పేలుడుకు తాలిబాన్ అని పిలిచే తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ బాధ్యత వహిస్తుందని ప్రకటించింది.
పాకిస్థాన్‌లోని క్వెట్టా నగర డీఐజీ తెలిపిన వివరాల ప్రకారం.. పోలియో వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న వ్యక్తుల రక్షణలో నిమగ్నమైన పోలీసు వాహనంపై బాంబు పేలుడు జరిగింది. ఈ దాడిలో 24 మంది గాయపడ్డారు. ఇందులో 20 మంది పోలీసులు ఉన్నారు. పాక్-ఇంగ్లండ్ మధ్య చారిత్రక టెస్టు సిరీస్ ప్రారంభం సందర్భంగా పోలీసులపై జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు.
పాకిస్థాన్‌లో బాంబు పేలుడుకు ముందు ఇంగ్లండ్ జట్టుపై వైరస్ దాడి
జరిగింది. పాకిస్థాన్ చేరుకున్న ఇంగ్లండ్ జట్టులోని 14 మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. దీని కారణంగా టెస్ట్ సిరీస్ వాయిదా పడే ప్రమాదం ఉంది. ఇక, ఇప్పుడు పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో పోలీసు వాహనంపై బాంబు పేలుడు ఒక విధంగా పాక్‌లో భద్రతపై అనుమానాలను రేకెత్తించింది.
షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1 నుంచి పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. బాంబు పేలుడు నగరమైన క్వెట్టాకు 850 కిలోమీటర్ల దూరంలోని రావల్పిండిలో తొలి టెస్టు జరగనుంది. అయితే పోలీసు వాహనంపై దాడి జరగడంతో భయాందోళనలు నెలకొన్నాయి.