
Mohammed Siraj Birth Day: భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. తొలి దశ నుంచి రిటైర్మెంట్ వరకు ఎన్నో మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ఘన విజయాలు అందించేందుకు ఎంతో కష్టపడ్డారు. ఈ క్రమంలో గవాస్కర్, సచిన్ ఇలా ఎందరో దిగ్గజాల పేరుగు చిరస్థాయిగా నిలిచిపోయాయి. వీళ్లను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది ప్లేయర్లు క్రికెట్ వైపు తమ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది క్రీడాకారులు భారత జట్టుకు ఆడాలనే కోరికతో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వారిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా ఒకడు. హైదరాబాద్ నుంచి భారత జట్టు వరకు ఆయన ప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ిన విశేషాలు తెలుసుకుందాం..
సరిగ్గా 31 సంవత్సరాల క్రితం ఇదే రోజున, అంటే మార్చి 13, 1994న, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ జన్మించాడు. తల్లిదండ్రులు ఆటో రిక్షా డ్రైవర్ మీర్జా మొహమ్మద్ గౌస్, షబానా బేగం. ఈ ఫాస్ట్ బౌలర్ 19 సంవత్సరాల వయసులో క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు, నవంబర్ 2015లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2016/17 రంజీ ట్రోఫీలో, అతను హైదరాబాద్ తరపున తొమ్మిది మ్యాచ్‌లలో 17 ఇన్నింగ్స్‌లలో 41 వికెట్లు పడగొట్టాడు. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా నిలిచాడు. దీంతో ఒక్కసారిగా సిరాజ్ పేరు వెలుగులోకి వచ్చింది.
ఫిబ్రవరి 2018లో 2017–18 విజయ్ హజారే ట్రోఫీలో మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఈ కాలంలో, సిరాజ్ ఏడు మ్యాచ్‌ల్లో 5.68 ఎకానమీతో 23 వికెట్లు పడగొట్టాడు. దీంతో టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ సహాయంతో ఐపీఎల్ గడప తొక్కాడు. ఇలా ఫిబ్రవరి 2017లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ వేలంలో సిరాజ్‌ను రూ.2.6 కోట్లకు తమ జట్టులోకి చేర్చుకుంది. తన తొలి ఐపీఎల్ సీజన్ ఆడుతున్న అతను ఆరు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. 2018 నుంచి 2024 వరకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిరాజ్‌ను అంటిపెట్టుకుంది. సిరాజ్ అత్యుత్తమ IPL ప్రదర్శన 2023లో వచ్చింది. అతను 14 మ్యాచ్‌ల్లో 7.52 ఎకానమీ రేటుతో 19 వికెట్లు పడగొట్టాడు.
నవంబర్ 2022లో నేపియర్‌లో న్యూజిలాండ్‌పై సిరాజ్ తన అత్యుత్తమ టీ20ఐ ప్రదర్శనను అందించాడు. టై అయిన మ్యాచ్‌లో, అతను తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 17 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. జనవరి 2024లో కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 15 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి తన అత్యుత్తమ టెస్ట్ ప్రదర్శనను నమోదు చేశాడు. అంతకుముందు, 2023 ఆసియా కప్ ఫైనల్లో, అతను తన అత్యుత్తమ వన్డే ప్రదర్శనను కనబరిచాడు. ఏడు ఓవర్లలో 21 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి శ్రీలంకను కేవలం 50 పరుగులకే కట్టడి చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..