
Ollie Robinson Record vs PAK: లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో వాతావరణం పూర్తిగా బౌలర్లకు అనుకూలిస్తోంది. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ పేసర్ ఓలీ రాబిన్సన్ తొలి బంతికే మాయ చేశాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ ఓపెనర్ అజాన్ అవాస్ను మొదటి బంతికే పెవిలియన్ చేర్చాడు. రౌండ్ ది వికెట్ నుంచి రాబిన్సన్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతి.. పిచ్ అయ్యాక అనూహ్యంగా లోపలికి దూసుకొచ్చింది. ఆ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన అవాస్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బ్యాటర్ రివ్యూ కోరినా అల్ట్రా ఎడ్జ్‌లో ఎలాంటి బ్యాట్ ఎడ్జ్ తగల్లేదని తేలిపోయింది. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి బంతికే అవుటైన రెండో పాకిస్థాన్ బ్యాటర్‌గా అవాస్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. వాన కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్థాన్ 9.4 ఓవర్లలో 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రాబిన్సన్ ఖాతాలోనే షాన్ మసూద్ వికెట్ కూడా పడింది.
పాక్ ఓపెనర్‌ను డకౌట్ చేయడం ద్వారా రాబిన్సన్ ఒక చారిత్రక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం భారత లెజెండ్ కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డును ఇప్పుడు తిరగరాశాడు. 1983లో జలంధర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో కపిల్ దేవ్ సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ మోసిన్ ఖాన్‌ను కపిల్ తొలి బంతికే అవుట్ చేశాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ టెస్టు మ్యాచ్ మొదటి బంతికే పాకిస్థాన్ బ్యాటర్‌ను పెవిలియన్ పంపిన ఘనత రాబిన్సన్‌కే దక్కింది.
Ollie Robinson gets off to the perfect start with the very first ball against Pakistan! 🔥#OllieRobinson #ENGvsPAK
pic.twitter.com/vbPVc3D6iX— CREX (@Crex_live) August 19, 2026
టెస్టు మ్యాచ్ తొలి బంతికే వికెట్ తీసిన ఇంగ్లండ్ బౌలర్ల జాబితాలో రాబిన్సన్ ఆరో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు మారిస్ టేట్ (1926), జెఫ్రీ ఆర్నాల్డ్ (1974, 1975), ర్యాన్ సైడ్‌బాటమ్ (2007), జేమ్స్ అండర్సన్ (2019) ఈ ఘనత సాధించారు. ప్రస్తుత ఇంగ్లండ్ బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ లాంటి సీమర్లు ఉన్నప్పటికీ.. బంతిని రెండు వైపులా అద్భుతంగా స్వింగ్ చేయగల ఏకైక బౌలర్ రాబిన్సన్ మాత్రమే కావడం ఇంగ్లండ్ జట్టుకు బాగా కలిసిరానుంది.
ఓవర్ కాస్ట్ పరిస్థితులను అద్భుతంగా వాడుకున్న రాబిన్సన్.. తొలి బంతికే వికెట్ తీసి పాకిస్థాన్ జట్టును మానసికంగా దెబ్బతీశాడు. భవిష్యత్తులో ఈ సిరీస్ ఆసాంతం అతని స్వింగ్ బౌలింగ్ ఇంగ్లండ్ జట్టుకు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..