
IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య గౌహతి వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో భారత యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ తీవ్ర గాయం పాలై మైదానాన్ని వీడారు. విండీస్ బ్యాటర్లు షై హోప్, అమీర్ జాంగూ క్రీజులో వేగంగా పరుగులు చేస్తున్న వేళ, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 36వ ఓవర్ బౌలింగ్ బాధ్యతలను నమన్ ధీర్‌కు అప్పగించారు. ఈ ఓవర్ మొదటి బంతిని విసిరిన వెంటనే నమన్ ధీర్ ఎడమ కాలు మడతపడటంతో నొప్పితో మైదానంలోనే పడిపోయారు.
నమన్ ధీర్ నొప్పితో విలవిలలాడటంతో భారత వైద్య సిబ్బంది, ఫిజియోలు హుటాహుటిన మైదానంలోకి వచ్చి ఆయనను పరిశీలించారు. తీవ్రమైన అసౌకర్యంతో కనిపించిన ఆయన, నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కుంటుతూ మైదానాన్ని వీడారు. ఆ తర్వాత ఆ ఓవర్ లోని మిగిలిన ఐదు బంతులను ఆకిబ్ నబీ పూర్తి చేయగా, నితీష్ కుమార్ రెడ్డి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చారు. నమన్ ధీర్ గాయం తీవ్రత ఎంతవరకు ఉందనే దానిపై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ గాయం కారణంగా ఆయన మిగిలిన సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
🚨 INJURY SCARE FOR NAMAN DHIR! 😟🇮🇳
On the first ball of his 7th over, Naman Dhir appeared to suffer from cramps and was forced to LEAVE THE FIELD.
Hopefully, it’s NOTHING SERIOUS and he’ll be back soon! 🙏
📸 Image Credit: JioHotstar#INDvsWI #NamanDhir pic.twitter.com/HQPVAEOyvB
— CricInformer (@CricInformer) September 30, 2026
ఈ సిరీస్‌లోనే మొదటి వన్డే ద్వారా అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన నమన్ ధీర్‌కు ఇది ఎంతో కీలకమైన మ్యాచ్. మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ భారీ భాగస్వామ్యంతో ఛేజింగ్ పూర్తి చేయడంతో నమన్ ధీర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొదటి మ్యాచ్‌లో 5 ఓవర్లు వేసి 6.60 ఎకానమీ నమోదు చేయగా, రెండో వన్డేలో గాయపడటానికి ముందు 6 ఓవర్లలో 6.16 ఎకానమీతో బౌలింగ్ చేశారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో జాన్ కాంప్‌బెల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను డైవ్ చేస్తూ అద్భుతంగా పట్టుకుని ఆకట్టుకున్నారు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆల్ రౌండర్ పాత్రలో అద్భుతంగా రాణించి జాతీయ జట్టులోకి ఎంపికైన నమన్ ధీర్, అరంగేట్రం చేసిన వెంటనే గాయపడటం క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఆయన గాయం తీవ్రమైతే, భారత మేనేజ్‌మెంట్ తుది జట్టులో మార్పులు చేయాల్సి ఉంటుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్నప్పటికీ, బౌలింగ్, బ్యాటింగ్ రెంటిలోనూ సహకరించే ఆల్‌రౌండర్ దూరం కావడం జట్టు బ్యాలెన్సింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..