మహేంద్రసింగ్ ధోని… ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానులు పూనకంతో ఊగిపోతారు. భారత్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన ఈ మిస్టర్ కూల్.. దేశానికి ఎంతో పేరు తెచ్చిపెట్టాడు. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ధోనిని కామెంట్ చేశాడని ఏకంగా సచిన్‌ను సైతం ట్రోల్ చేస్తున్నారు. అంతటి డై హార్డ్ ఫ్యాన్స్ ధోనికి ఉన్నారు. సరిగ్గా ఇలాంటి ఓ అభిమాని ధోనిపై ఉన్న అభిమానంతో ధోని అభిమానుల ఆకలి బాధను తీరుస్తున్నాడు.
పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌ద్వార్ పట్టణానికి చెందిన శంభు బోస్(32) ధోనికి వీరాభిమాని. అయితే తాను కేవలం ధోని అభిమానిని చెప్పుకుని తిరగకుండా.. ఓ మంచి పనికి పూనుకున్నాడు. అతడు ఉంటున్న పట్టణంలో ఓ హోటల్ పెట్టి ధోని అభిమానులందరికి మూడు పూటలా ఉచిత భోజనం అందించడం ప్రారంభించాడు. ఇలా సమాజ సేవ చేస్తున్న బోస్.. ఆ పట్టణంలో ఉన్న నిరుపేదలైన ధోని అభిమానులకు ఆపద్బాంధవుడైయ్యాడు.
కాగా ఈ విషయం మీడియాకు తెలియడంతో బోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాడు. అతను చేసే పనులకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బోస్ మాత్రం ఈ సేవను ఇక్కడికే పరిమితం చేయనని.. మరికొన్ని హోటల్స్ ప్రారంభించి.. తనలాంటి ధోని అభిమానులకు మరింత సేవ చేస్తానని స్పష్టం చేశాడు.