
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన వెంటనే సంచలన ప్రదర్శన చేశాడు. 39 ఏళ్ల వయసులో పోర్చుగల్ తరఫున ఆడుతున్న హెన్రిక్స్.. టీ20 ప్రపంచకప్ యూరప్ సబ్-రీజనల్ క్వాలిఫైయర్‌లో చెకియాపై కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌తో పోర్చుగల్ భారీ స్కోరు సాధించి ఘన విజయం అందుకుంది.
ఫిన్లాండ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పోర్చుగల్ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు చేసింది. ఇందులో హెన్రిక్స్‌దే ప్రధాన పాత్ర. 51 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ ఏకంగా 217.64గా ఉండటం విశేషం. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో హెన్రిక్స్‌కు ఇదే తొలి సెంచరీ. ఆస్ట్రేలియా తరఫున 21 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడినా కూడా హెన్రిక్స్ ఖాతాలో ఒక సెంచరీ కూడా లేదు. కానీ పోర్చుగల్ తరఫున ఆడిన మూడో మ్యాచ్‌లోనే సెంచరీ బాదేశాడు.
212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెకియా ఛేజింగ్‌ను వర్షం అడ్డుకుంది. దీంతో డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ పద్ధతి ప్రకారం ఆ జట్టు లక్ష్యాన్ని 8.5 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ణయించారు. అయితే చెకియా బ్యాటర్లు పోర్చుగల్ బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. 8.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 24 పరుగులు మాత్రమే చేశారు. దీంతో పోర్చుగల్ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుత సెంచరీ చేసిన హెన్రిక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
హెన్రిక్స్‌కు పోర్చుగల్ తరఫున ఇది నాలుగో మ్యాచ్ మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన వెంటనే తన సత్తా చాటుతున్నాడు. టోర్నీలో పోర్చుగల్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌పై 39 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో పోర్చుగల్ 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. మోయిసెస్ హెన్రిక్స్ పోర్చుగీస్ ద్వీపమైన మదీరాలోని ఫంచల్‌లో జన్మించాడు. చిన్నతనంలోనే కుటుంబంతో ఆస్ట్రేలియాకు వెళ్లిన అతడు అక్కడే క్రికెట్ కెరీర్‌ను నిర్మించుకున్నాడు. 17 ఏళ్ల వయసులో న్యూ సౌత్ వేల్స్‌తో తొలి ఒప్పందం చేసుకున్నాడు. 2006లో ఆ రాష్ట్రం తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు.
పోర్చుగల్‌లో జన్మించిన కారణంగా ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే అర్హత అతడికి లభించింది. 2026 జూలైలో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం పోర్చుగల్ తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాడు. 2028 టీ20 ప్రపంచకప్‌కు పోర్చుగల్‌ను అర్హత సాధించేలా చేయడమే తన లక్ష్యమని హెన్రిక్స్ ఇప్పటికే ప్రకటించాడు.
హెన్రిక్స్ 2009 నుంచి 2021 మధ్య ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లలో 44 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 4 టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఉన్నాయి. అంతకుముందే 2006 అండర్-19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ అతడికి ఘనమైన రికార్డు ఉంది. NSW, సిడ్నీ సిక్సర్స్ తరఫున అన్ని ఫార్మాట్లలో 420 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్.. 14 ప్రధాన ట్రోఫీలు గెలుచుకున్నాడు. ఇప్పుడు పోర్చుగల్‌ను 2028 టీ20 ప్రపంచకప్‌కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి