Video: బౌన్సర్లు, అవుట్‌స్వింగర్లు.. మహ్మద్ షమీ మైండ్ గేమ్‌.. బ్యాటర్‎కు బ్లాక్ అయిందిగా

Video: టీమిండియా స్టార్ సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మళ్లీ తన పాత బౌలింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. దిలీప్ ట్రోఫీ 2026 సెమీఫైనల్స్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న షమీ, అత్యంత వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి ప్రత్యర్థి బ్యాటర్‌ను అవుట్ చేసిన విధానం సంచలనం సృష్టిస్తోంది. ఈ మైండ్ బ్లోయింగ్ వికెట్ వీడియోను బీసీసీఐ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది.

Video: బౌన్సర్లు, అవుట్‌స్వింగర్లు.. మహ్మద్ షమీ మైండ్ గేమ్‌.. బ్యాటర్‎కు బ్లాక్ అయిందిగా
Mohammed Shami

Updated on: Aug 31, 2026 | 5:22 PM

Video: చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న మహ్మద్ షమీ, ప్రస్తుతం జరుగుతున్న దిలీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో సెంట్రల్ జోన్‌పై ఈస్ట్ జోన్ తరఫున మైదానంలోకి దిగాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే తన సుదీర్ఘ అనుభవాన్ని, బౌలింగ్ టాలెంటును చూపించాడు. మైదానంలో ఆయన వేసిన ప్రతి బంతి ప్రత్యర్థి బ్యాటర్లకు తీవ్రమైన పరీక్షగా మారింది.

బ్యాటర్ యశ్ రాథోడ్‌ను అవుట్ చేయడానికి షమీ అమలు చేసిన ప్లాన్ క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. వరుసగా ఐదు బంతులను ఆఫ్ స్టంప్‌కు దూరంగా ఆరో వికెట్ లైన్‌లో సంధించి బ్యాటర్‌ను నిలకడగా ఆడేలా చేశాడు. ఆ తర్వాత ఊహించని విధంగా రెండు పదునైన బౌన్సర్లు విసిరి ఒత్తిడి పెంచాడు. ఈ బౌన్సర్లను శరీరం వైపు కాకుండా అదే ఆఫ్ స్టంప్ లైన్‌లోనే వేయడం విశేషం. చివరికి 68 బంతుల్లో 27 పరుగులు చేసి క్రీజులో కుదురుకున్న యశ్ రాథోడ్‌ను ముగ్గులోకి దించి, ముందుకు వచ్చి ఆడేలా ప్రేరేపించాడు. షమీ వేసిన పదునైన బంతి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతుల్లో పడటంతో బ్యాటర్ నిరాశగా వెనుతిరిగాడు.

ఈ ఇన్నింగ్స్‌లో షమీ మొత్తం 16 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 మెయిడెన్ ఓవర్లు కూడా ఉండటం ఆయన క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌కు నిదర్శనం. మ్యాచ్ వ్యాఖ్యాతలు సైతం షమీ వేసిన పగడ్బందీ స్పెల్‌ను, బ్యాటర్‌ను ట్రాప్‌ చేసిన విధానాన్ని ఆకాశానికెత్తేశారు. క్రీజులో ఎంత నిలదొక్కుకున్న బ్యాటర్ అయినా షమీ సృష్టించిన ఈ వ్యూహం ముందు తలవంచక తప్పలేదు.

మహ్మద్ షమీ 2025 మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. టెస్టుల్లో అయితే ఆయన చివరిసారిగా 2023 జూన్‌లో కనిపించాడు. మూడేళ్లకు పైగా టెస్ట్ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, తన ఫిట్‌నెస్, వేగం, స్వింగ్ ఏమాత్రం తగ్గలేదని ఈ ప్రదర్శనతో రుజువు చేశాడు. దిలీప్ ట్రోఫీలో ఆయన చూపిస్తున్న ఈ ఫామ్ రాబోయే అంతర్జాతీయ సిరీస్‌లలో టీమిండియా రీఎంట్రీకి మార్గం సుగమం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us