MLC 2026: క్రికెట్ చరిత్రలోనే ఊహించని సంచలనం.. 18.4 ఓవర్లలో 267 పరుగుల టార్గెట్ ఊదేశారు

MLC 2026 : మేజర్ లీగ్ క్రికెట్ 2026లో వాషింగ్టన్ ఫ్రీడమ్ టీ20 చరిత్రలోనే అతిపెద్ద విజయవంతమైన రన్ ఛేజ్ నమోదు చేసింది. ఎంఐ న్యూయార్క్ నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలో ఛేదించి సంచలన విజయం సాధించింది. స్టీవ్ స్మిత్, ఆండ్రీస్ గౌస్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు అభిమానులను ఆశ్చర్యపరిచాయి.

MLC 2026: క్రికెట్ చరిత్రలోనే ఊహించని సంచలనం.. 18.4 ఓవర్లలో 267 పరుగుల టార్గెట్ ఊదేశారు
Mlc 2026

Updated on: Jul 16, 2026 | 3:03 PM

MLC 2026: క్రికెట్ ప్రపంచంలో ముఖ్యంగా పొట్టి ఫార్మాట్ అయిన టీ20ల్లో రోజూ ఏదో ఒక రికార్డు నమోదవుతూనే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన రికార్డు మాత్రం క్రికెట్ అభిమానులను నోరెళ్లబెట్టేలా చేసింది. ఎవరూ ఊహించని విధంగా అసాధ్యం అనుకున్న భారీ లక్ష్యాన్ని చేధించి టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత పెద్ద రన్ ఛేజ్‌ను నమోదు చేసింది వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు. ఓక్లాండ్ కొలీసియం వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ విధించిన 267 పరుగుల భారీ లక్ష్యాన్ని వాషింగ్టన్ ఫ్రీడమ్ కేవలం 4 వికెట్లు కోల్పోయి, 18.4 ఓవర్లలోనే 270 పరుగులు చేసి రికార్డుల కెక్కారు.

ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ న్యూయార్క్ జట్టు పరుగుల విధ్వంసం సృష్టించింది. ఆ జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 13 సిక్సర్ల సాయంతో 106 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా క్వింటన్ డి కాక్ 51 పరుగులు, కీరన్ పొలార్డ్ 64 పరుగులతో రెచ్చిపోవడంతో ఎంఐ న్యూయార్క్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగుల కొండంత స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో ఎంఐ బ్యాటర్లు మొత్తం 29 సిక్సర్లు బాదారు, ఇది ఏ లీగ్ క్రికెట్ ఇన్నింగ్స్‌లోనైనా అత్యధిక సిక్సర్ల రికార్డు. వాషింగ్టన్ బౌలర్ రచిన్ రవీంద్ర 4 వికెట్లు తీసి కాస్త కట్టడి చేసినప్పటికీ, ఆ సమయంలో ఈ స్కోరును ఎవరూ ఛేజ్ చేయలేరనే అందరూ భావించారు.

కానీ 267 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు ఏమాత్రం బెదరలేదు. మొదటి బంతి నుంచే ఆ జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 132 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి కెప్టెన్ స్టీవ్ స్మిత్ అండగా నిలిచి 48 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి వీరబాదుడుతో ఎంఐ న్యూయార్క్ బౌలర్లు చేతులెత్తేశారు. టీ20 క్రికెట్ లో ఇప్పటివరకు ఇన్ని పరుగులను ఎవరూ విజయవంతంగా ఛేజ్ చేయలేదు, దీంతో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అపురూపమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us