
Manav Suthar County Cricket: భారత క్రికెట్ సరికొత్త ఆణిముత్యం, యువ స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న కౌంటీ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడు, వార్విక్‌షైర్ జట్టు తరపున బరిలోకి దిగి తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ గడ్డపై భారత జెండాను ఎగురవేశాడు.
మన దేశంలో రంజీ ట్రోఫీ ఎంత ప్రతిష్టాత్మకమైనదో, ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగినది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది మేటి ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ ఎర్ర బంతి టోర్నమెంట్‌లో పాల్గొంటారు. గతంలో ఎందరో భారత దిగ్గజాలు ఇక్కడ ఆడి రాటుదేలారు. ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ, ఆఫ్ఘనిస్తాన్‌పై భారత టెస్ట్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ కౌంటీల్లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం భారతదేశంలో దేశవాళీ మ్యాచ్‌లు లేకపోవడంతో, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వార్విక్‌షైర్ క్లబ్‌తో కేవలం రెండు మ్యాచ్‌ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కొద్ది సమయంలోనే అతను సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
జూన్ 12న కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మానవ్ సుతార్, తన మొదటి మ్యాచ్‌లోనే పర్వాలేదనిపించాడు. అయితే, సమర్‌సెట్ జట్టుతో టౌంటన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం అతడు విశ్వరూపం ప్రదర్శించాడు. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, మానవ్ సుతార్ వేసిన అద్భుతమైన బంతులు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అతడు మొత్తం 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి దిగువ వరుస బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతూ 2 వికెట్లు పడగొట్టిన మానవ్, రెండో ఇన్నింగ్స్‌లో మరింత ప్రమాదకరంగా మారి లంచ్ విరామం తర్వాత ఐదు వికెట్ల ఘనతను (ఫైవ్ వికెట్ హాల్) అందుకున్నాడు.
సమర్‌సెట్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్ బౌలింగ్ శైలి అత్యంత ఆకట్టుకుంది. సుదీర్ఘంగా 46.5 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన ఈ యువ ఆటగాడు, కేవలం 100 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లను కూల్చాడు. ఓపెనర్ జొర్డాన్ హెర్మన్‌ను 34 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా వికెట్ల వేటను ప్రారంభించిన మానవ్, ఆ తర్వాత ప్రమాదకరమైన వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ కోహ్లర్ క్యాడ్‌మోర్‌ను కేవలం 12 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత పిచ్‌పై కుదురుకునేందుకు ప్రయత్నించిన జోష్ షా, అల్ఫీ ఓగ్బోర్న్, జేక్ బాల్ వంటి బ్యాటర్లను వరుస విరామాల్లో అవుట్ చేసి సమర్‌సెట్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు.
వార్విక్‌షైర్ జట్టు తరఫున మానవ్ సుతార్ ఆడిన ఈ రెండు మ్యాచ్‌ల ప్రయాణం అత్యంత విజయవంతంగా ముగిసింది. యార్క్‌షైర్, సోమర్‌సెట్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్‌గా తన ముద్ర వేశాడు. బౌలింగ్‌లో కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే మొత్తం 11 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పిచ్‌లపై స్పిన్నర్ల హవా సాగుతుందని నిరూపించాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా, బ్యాటింగ్‌లోనూ లోయర్ ఆర్డర్‌లో వచ్చి మూడు ఇన్నింగ్స్‌ల్లో కీలకమైన 98 పరుగులు జోడించి జట్టుకు అవసరమైనప్పుడు అండగా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..