Team India: క్రికెట్‌లో కొంతమంది ప్రత్యేకమైన ఆటగాళ్ళు ఉంటారు. వాళ్ల రికార్డులను బద్దలు కొట్టడం ఎప్పటికీ కష్టంగా అనిపించవచ్చు. కానీ, దురదృష్టవశాత్తు అలాంటి కొంతమంది ఆటగాళ్లకు వారి దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. ఇటువంటి వాళ్లలో టీమిండియా ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారిలో ఒకరు రాజిందర్ గోయల్. ఈయన 1942లో సెప్టెంబర్ 20న జన్మించాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంజీ ట్రోఫీలో 637 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. రంజీ ట్రోఫీలో ఇంతకంటే ఎక్కువ వికెట్లు ఏ బౌలర్ తీయలేకపోవడం గమనార్హం.
ఇలాంటి చరిత్ర ఉన్నా.. రాజిందర్ గోయల్ భారతదేశం తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో, అతను 18.59 సగటుతో 750 వికెట్లను తన పేరిట కలిగి ఉన్నాడు. అయినా అతను భారత్‌కు ఎందుకు ఆడలేకపోయాడు? అందుకు కారణం ఒకటుంది. బిషన్ సింగ్ బేడీకి సమకాలీనుడు కావడమే అతని దురదృష్టంగా మారింది. ప్రతిభకు లోటు లేదు. కానీ, అదృష్టం మాత్రం అస్సలు లేకపోయింది. అయితే, ఓ సందర్భంలో గోయల్ తన కంటే మెరుగైన బౌలర్ అని భారత లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ బిషన్ సింగ్ బేడీ చెప్పడం గమనార్హం. నాకు భారత్ తరపున ఆడే అవకాశం వచ్చింది. అతనికి రాలేదు అంటూ వాపోయారు.
పంజాబ్‌లోని నర్వానాలో జన్మించిన గోయల్ 1958-59లో సౌత్ పంజాబ్ తరపున తన మొదటి రంజీ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత హర్యానా, ఢిల్లీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీకి ఆడుతున్నప్పుడు బేడీతో కలిసి బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. అతను బేడీకి ఆరాధకుడు. 2001లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆ సమయంలో భారత్‌కు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాత్రమే ఆడగలడని, అది బిషన్ సింగ్ బేడీ అంటూ కుండ బద్దలు కొట్టారు.
1974లో ఒకసారి, బేడీ గైర్హాజరీలో గోయల్‌కు టీమ్ ఇండియాలో చోటు దక్కే అవకాశం వచ్చింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో క్లైవ్ లాయిడ్ ప్రమాదకరమైన వెస్టిండీస్ జట్టుతో తలపడింది. వివి రిచర్డ్స్ అప్పుడు అరంగేట్రం చేయబోతున్నాడు. గోయల్ జట్టులో చోటు దక్కుతుందని ఖచ్చితంగా అనుకున్నాడు. కానీ, ప్లేయింగ్ 11కి వచ్చేసరికి అతని పేరు లేదు. భవిష్యత్తులో కూడా అతను భారత్‌కు ఆడేందుకు కొన్ని అడుగుల దూరంలో నిలబడ్డాడని అనిపించే సందర్భాలు కూడా వచ్చాయి. కానీ ఇవి జరగలేదు. అయితే, ఎప్పటిలాగే, అతను ఎవరినీ నిందించలేదు.
గోయల్ అనారోగ్యంతో 2020 సంవత్సరంలో రోహ్‌తక్‌లో మరణించారు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ, లక్ మాత్రం కలిసి రాకపోవడంతో.. టీమిండియా తరపున ఆడాలన్న తన కల నెరవేరకుండానే లోకాన్ని వీడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ కల్ిక్ చేయండి..