T20 League : ఇదేం విచిత్రం సామి.. ఐపీఎల్‌లో సెంచరీలతో చెలరేగినా టీ20 లీగ్ వేలంలో అమ్ముడుపోని స్టార్ ప్లేయర్

T20 League : ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్ చూపించినప్పటికీ మహారాజా టీ20 లీగ్ వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి కేఎల్ రాహుల్ గత ఐపీఎల్ సీజన్లలో కాస్త నెమ్మదిగా ఆడుతాడనే విమర్శలు ఉన్నాయి.

T20 League : ఇదేం విచిత్రం సామి.. ఐపీఎల్‌లో సెంచరీలతో చెలరేగినా టీ20 లీగ్ వేలంలో అమ్ముడుపోని స్టార్ ప్లేయర్
Kl Rahul

Updated on: Jun 05, 2026 | 6:05 PM

T20 League : భారత స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్‎కు క్రికెట్ ప్రపంచంలో ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పరుగుల వరద పారించినప్పటికీ, ప్రతిష్టాత్మక మహారాజా టీ20 లీగ్ వేలంలో అతను అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. కనీస ధర వద్ద కూడా రాహుల్‌ను సొంతం చేసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజానికి కేఎల్ రాహుల్ గత ఐపీఎల్ సీజన్లలో కాస్త నెమ్మదిగా ఆడుతాడనే విమర్శలు ఉన్నాయి. కానీ, ఐపీఎల్ 2026లో అతను తన బ్యాటింగ్ శైలిని పూర్తిగా మార్చేసి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత అగ్రెసివ్‌గా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున 14 ఇన్నింగ్స్‌లలో 45.61 సగటుతో ఏకంగా 593 పరుగులు సాధించాడు. ఇందులో విశేషం ఏంటంటే.. 174.41 కళ్లు చెదిరే స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి, ఢిల్లీ జట్టులోనే హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఓవరాల్ ఆరెంజ్ క్యాప్ రేసులో 7వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఈ సీజన్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 67 బంతుల్లోనే ఎవరూ ఊహించని విధంగా 152 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా రాహుల్ రికార్డులకెక్కాడు. దీనితో పాటు ఐపీఎల్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల (పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున 1000కి పైగా పరుగులు సాధించిన తొలి ప్లేయర్‌గా కూడా సరికొత్త మైలురాయిని అందుకున్నాడు.

ఇంత మంచి ఫామ్‌లో ఉన్నా మహారాజా లీగ్ వేలంలో రాహుల్‌ను కొనకపోవడానికి ఒక బలమైన టెక్నికల్ కారణం ఉంది. జూన్ 2026లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇండియాలోనే ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు సంబంధించి టీమిండియా టెస్ట్ జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దేశం తరఫున ఆడాల్సి రావడంతో, అతను స్థానిక లీగ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం కష్టమని ఫ్రాంచైజీలు భావించాయి.

ఆఫ్ఘనిస్తాన్ పర్యటన షెడ్యూల్, మహారాజా టీ20 లీగ్ ప్రారంభ తేదీలు ఒకే సమయంలో వచ్చాయి. ఈ సిరీస్‌లోని చివరి వన్డే మ్యాచ్ జూన్ 20న జరగాల్సి ఉంది. సరిగ్గా అదే రోజున మహారాజా టీ20 లీగ్ కూడా ప్రారంభమవుతుంది. దీనికి తోడు రాహుల్ ఇప్పుడే సుదీర్ఘమైన ఐపీఎల్ సీజన్ పూర్తి చేసుకుని వెంటనే అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. విరామం లేకుండా ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఫ్రాంచైజీలు అతనిపై వేలంలో రిస్క్ తీసుకోలేదు. వేలం నిర్వాహకులు కూడా రాహుల్ ప్రస్తుతానికి లీగ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని క్లారిటీ ఇచ్చారు.

గతంలో కర్ణాటక ప్రీమియర్ లీగ్ (KPL)గా పిలవబడే ఈ టోర్నమెంట్‌ను ఇప్పుడు మహారాజా ట్రోఫీ టీ20గా నిర్వహిస్తున్నారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీకి ఇది ఐదో ఎడిషన్. మొత్తం ఆరు ఫ్రాంచైజీలు టైటిల్ కోసం తలపడనున్నాయి. జూన్ 20న కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్, గుల్బర్గా మిస్టిక్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. కోస్టల్ కింగ్స్ మంగళూరు అనే కొత్త జట్టు జూన్ 21న హుబ్లీ టైగర్స్‌తో తలపడడం ద్వారా అరంగేట్రం చేయనుంది. ఈ మ్యాచ్‌లు మైసూర్, హుబ్లీ, బెంగళూరు నగరాల్లో వేర్వేరు తేదీల్లో జరిగి, జూలై 12న బెంగళూరులో జరిగే ఫైనల్‌తో ముగుస్తాయి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us