Vaibhav Sooryavanshi : వైభవ్ కంటే పెద్ద ఫ్యూచర్ ఎవరికుంది?.. గౌతమ్ గంభీర్, సెలెక్టర్లపై విరుచుకుపడ్డ మహ్మద్ కైఫ్

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్ పర్యటనలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోకపోవడంపై మేనేజ్‌మెంట్‌పై మహ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ల ఉదాహరణలను గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vaibhav Sooryavanshi : వైభవ్ కంటే పెద్ద ఫ్యూచర్ ఎవరికుంది?.. గౌతమ్ గంభీర్, సెలెక్టర్లపై విరుచుకుపడ్డ మహ్మద్ కైఫ్
Vaibhav Sooryavanshi

Updated on: Jun 30, 2026 | 9:30 AM

Vaibhav Sooryavanshi : టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ పర్యటనలో ఆడే అవకాశం ఇవ్వకపోవడంపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ ఈ టి20 సిరీస్‌ను 0-2 తేడాతో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘోర పరాజయం తర్వాత జట్టు ఎంపికపై స్పందించిన కైఫ్.. సెలెక్షన్ ప్రాసెస్‌లో ఆటగాళ్లందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉండాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు జట్టును నిర్మించడమే మీ లక్ష్యమైతే, 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న వైభవ్ కంటే మెరుగైన ఆప్షన్ మరెవ్వరూ ఉండరని ఆయన స్పష్టం చేశారు.

గతంలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు, అలాగే టి20 వరల్డ్ కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను లీడర్‌షిప్ బాధ్యతల నుంచి పక్కనబెట్టినప్పుడు.. టీమ్ మేనేజ్‌మెంట్ ‘భవిష్యత్తు వైపు చూస్తున్నాం, యువ రక్తాన్ని ప్రోత్సహిస్తాం’ అని పెద్ద పెద్ద మాటలు చెప్పిందని కైఫ్ గుర్తు చేశారు. ‘నిజంగానే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే, వైభవ్ సూర్యవంశీ కంటే పెద్ద భవిష్యత్తు ఏ ఆటగాడిలోనూ కనిపించడం లేదు. బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయాలనుకుంటే అందులో వైభవ్ పేరు ఖచ్చితంగా ఉండాలి. ఇది వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కాబట్టి అదే కాంబినేషన్‌తో వెళ్తాం అనే కుంటి సాకులు చెప్పడం మానేయాలి’ అని కైఫ్ నిలదీశారు.

ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సంచలనాలను కైఫ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘ఆ 15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ప్రపంచ స్థాయి ప్రమాదకరమైన బౌలర్లను ఎదుర్కొని సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును సైతం వైభవ్ బద్దలు కొట్టాడు. ఇంతలా ఫామ్ లో ఉండి, అంతర్జాతీయ స్థాయికి సిద్ధంగా ఉన్న ఆటగాడిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడం నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది’ అని కైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.

టీమిండియాలో ఒక్కో ఆటగాడికి ఒక్కో రకమైన రూల్స్ ఉండకూడదని, జట్టు ఎంపికలో పారదర్శకత చాలా అవసరమని కైఫ్ హితవు పలికారు. సెలెక్షన్ కమిటీ తీసుకున్న ఈ వింత నిర్ణయం వల్లే ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో మనం తలదించుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. అయితే, జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కాబోయే టి20 సిరీస్‌పైనే ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలోనైనా ఈ యువ రికార్డ్ బ్రేకర్ వైభవ్ సూర్యవంశీకి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం లభిస్తుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us