IPL చరిత్రలోనే సంచలనం.. తోపు రికార్డ్‌ను బద్దలు కొట్టిన డేంజరస్ ప్లేయర్..!

RCB vs GT: కాగిసో రబాడ సృష్టించిన ఈ సరికొత్త రికార్డు గుజరాత్ టైటాన్స్ శిబిరంలో జోష్ నింపగా, ప్రధాన ఆటగాళ్ల గాయాలు, కీలక వికెట్లు కోల్పోవడం ఆర్‌సీబీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ నాకౌట్ పోరులో ఫైనల్ బెర్త్‌ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

IPL చరిత్రలోనే సంచలనం.. తోపు రికార్డ్‌ను బద్దలు కొట్టిన డేంజరస్ ప్లేయర్..!
Rcb Vs Gt Rabada

Updated on: May 26, 2026 | 9:34 PM

ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత రసవత్తర ఘట్టానికి చేరుకుంది. క్వాలిఫైయర్-1 పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడుతుండగా, మైదానంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మక రికార్డు నమోదైంది. గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కాగిసో రబాడ తన సంచలన బౌలింగ్‌తో ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ముల్లన్‌పూర్‌లో రబాడ మైలురాయి.. షమీ రికార్డు బద్దలు!

చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ కీలక నాకౌట్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే గుజరాత్ పేసర్ కాగిసో రబాడ పవర్‌ప్లేలో కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ చరిత్ర సృష్టించాడు.

ఇంతకుముందు 2023 సీజన్‌లో మహమ్మద్ షమీ పవర్‌ప్లే ఓవర్లలో 17 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా రబాడ ఈ సీజన్ పవర్‌ప్లేలోనే 18వ వికెట్ ఖాతాలో వేసుకుని షమీ రికార్డును అధిగమించాడు.

ఒకే ఐపీఎల్ సీజన్ పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లు:

కాగిసో రబాడ – 18 వికెట్లు (2026)

మహమ్మద్ షమీ – 17 వికెట్లు (2023)

మిచెల్ జాన్సన్ – 16 వికెట్లు (2013)

ట్రెంట్ బౌల్ట్ – 16 వికెట్లు (2020)

ఈ అద్భుత ప్రదర్శనతో రబాడ ఈ సీజన్‌లో మొత్తం 25 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఆర్‌సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు.

వెంటకటేష్ అయ్యర్ రూపంలో తొలి దెబ్బ..

ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి విరాట్ కోహ్లీతో కలిసి వెంకటేష్ అయ్యర్ బరిలోకి దిగాడు. ఈ జోడి 12 బంతుల్లో 21 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా అయ్యర్ 7 బంతుల్లోనే 19 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్నట్లు కనిపించాడు. అయితే రెండో ఓవర్ చివరి బంతికి రబాడ వేసిన షార్ట్ పిచ్ డెలివరీని పుల్ చేయడానికి ప్రయత్నించిన అయ్యర్ టైమింగ్ మిస్సయ్యాడు. మిడ్-ఆఫ్ దిశగా గాల్లోకి లేచిన బంతిని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌గా అందుకున్నాడు. అంతకుముందు బంతికే సిక్స్ బాదిన అయ్యర్, రబాడ వ్యూహానికి చిక్కి పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

హోల్డర్ మాయాజాలం.. ఆర్‌సీబీకి డబుల్ స్ట్రోక్

తొలి వికెట్ కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 72 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లీ 43 పరుగులు చేయగా, పడిక్కల్ 19 బంతుల్లో 30 పరుగులు చేసి క్రీజులో కుదురుకున్నారు. అయితే జేసన్ హోల్డర్ వేసిన ఒకే ఓవర్లో ఈ ఇద్దరు సెట్ బ్యాటర్లు వెనుతిరగడం ఆర్‌సీబీని తీవ్రమైన కష్టాల్లోకి నెట్టింది.

దురదృష్టవశాత్తూ కోహ్లీ ఆడిన షాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ అయ్యి స్టంప్స్‌ను తాకగా, పడిక్కల్ థర్డ్ మ్యాన్ దిశగా కట్ షాట్ ఆడబోయి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతికి చిక్కాడు. దీంతో ఆర్‌సీబీ 94 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

గాయంతో ఫిలిప్ సాల్ట్ దూరం.. ఆర్‌సీబీ జాగ్రత్త పడిందా?

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి పెద్ద షాక్ తగిలింది. గత కొన్ని వారాలుగా వేలి గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. చికిత్స కోసం ఇంగ్లాండ్ వెళ్లి వచ్చిన సాల్ట్.. ప్లేఆఫ్స్ సమయానికి కోలుకుంటాడని భావించినా, మేనేజ్‌మెంట్ అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా క్వాలిఫైయర్-2 రూపంలో మరో అవకాశం ఉండటంతో, భవిష్యత్తు మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని అతనికి విశ్రాంతినిచ్చారు. మరోవైపు యువ ఆటగాడు జాకబ్ బెథెల్ కూడా గాయపడటంతో ఆర్‌సీబీకి ఓపెనింగ్ సమస్యలు తప్పలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us