
ప్రపంచ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి విశ్వవిజేత వెస్టిండీస్. ఆ జట్టుతో క్రికెట్ అంటే ప్రాణాలతో చెలగాటమే. ఓటమి ఖాయం.. కానీ గాయాలు లేకుండా మ్యాచ్ ముగిస్తే చాలు అనుకునే వాళ్లు అప్పట్లో. తమ తిరుగులేని ఆటతో ఆధిపత్యం అంటే ఏంటో చూపించిన టీమ్ అది. కానీ, ఆ తర్వాత అధోగతి పాలైంది. ఇప్పుడు వెస్టిండీస్ అంటే ఓ సాధారణ జట్టు. వాళ్లుకు ఇలాంటి పరిస్థితి వచ్చేందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వెస్టిండీస్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. టీమిండియా కూడా అలా మారబోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే జరుగుతున్న పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహరణ.
వరుసగా రెండు సార్లు టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు పసికూన ఐర్లాండ్‌పై రెండు టీ20లు ఓడిపోవడం భారత క్రికెట్ అభిమానులనే కాదు మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరింది. ఐర్లాండ్ బాగా ఆడిందని మెచ్చుకోవచ్చు.. కానీ మన లోపాలను కప్పిపుచ్చుకోలేం. టీమిండియా ఆటగాళ్లు చెత్తగా ఆడారు అనే మాట వాస్తవం. ఒక మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలిస్తే అప్పుడప్పుడు అలాంటి అద్భుతాలు జరగడం కామన్ అనుకోవచ్చు.. కానీ వరుసగా రెండుసార్లు అంటే అది చిన్న విషయం కాదు. ఆ వెంటనే ఇంగ్లాండ్ పర్యటన.. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. కానీ రెండో మ్యాచ్‌లో ఓటమి. పైగా ఇది గెలవాల్సిన మ్యాచ్. మంచి స్కోర్ చేసి, ఆరంభంలోనే వికెట్లు తీసిన తర్వాత కూడా టీమిండియా చేజేతులా ఓటమి పాలైంది.
కొన్ని వారాల్లో జరిగిన ఈ దారుణలతో టీమిండియా పతనం మొదలైందా అంటే.. కాదు. దీనికి బీజం పడి చాలా కాలం అవుతుంది. కారణాలు ఏంటో తెలియదు కానీ, అద్భుతమైన టాలెంట్ ఉన్న కుర్రాళ్లను కాదని కొంతమంది ప్లేయర్లనే టీమిండియాలోకి బలవంతంగా తీసుకోవడం జరుగుతోంది. టీమ్ విజయాల బాటలో ఉంటే దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ, ఇప్పుడు వరుస ఓటములతో అది హైలెట్ అవుతుంది. ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు టీమ్‌లోకి ఎందుకొస్తున్నారో ఎవరికీ తెలియదు. మొహమ్మద్ సిరాజ్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్ వంటి ప్లేయర్లు ఎందుకు సెలెక్ట్ అవ్వడం లేదో క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌కి కూడా అర్థం కావడం లేదు.
టీమిండియాకు ఎంపికయ్యే ఆటగాళ్లు ఐపీఎల్‌లో రాణించిన వాళ్లే ఉంటున్నారే విమర్శ ఉంది. అంతెందుకు శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియా నుంచే వచ్చింది. అంతే కట్ చేస్తే.. టీమిండియాకు కెప్టెన్ అయిపోయాడు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ అసలు టీ20 టీమ్ దరిదాపుల్లో కూడా లేడు. అతను టీమిండియా తరఫున టీ20 ఆడి రెండు, మూడేళ్లు అవుతోంది. అలాంటి ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాగా చేస్తున్నాడని తీసుకొచ్చి కెప్టెన్‌ని చేసేశారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నుంచి తీసేయడానికి అతని బ్యాడ్ ఫామ్ కారణం కానీ, అతని కెప్టెన్సీ స్కిల్స్ కాదు. అలాంటప్పుడు ఇంకొంత కాలం అతనికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండు అని ఇప్పుడు అనిపిస్తోందని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. పైగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒంటెద్దు పోకడ కూడా జట్టుకు నష్టం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు లేకపోవడంతో ఒత్తిడి హ్యాండిల్ చేసే వాళ్లు కనిపించడం లేదనేది క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ మాట.
పోనీ ఐపీఎల్‌నే క్రైటీరియాగా తీసుకుంటే.. మొహమ్మద్ సిరాజ్ 2026 సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ, అతన్ని సెలెక్ట్ చేసినట్లే చేసి, రెస్ట్ పేరుతో పక్కనపెట్టారు. అతని ప్లేస్‌లో ప్రసిద్ధ్‌ను తీసుకొని చేతులు కాల్చుకున్నారు. డొమెస్టిక్‌లో రాణించే ప్లేయర్లను అస్సలు పట్టించుకోని సెలెక్టర్లు, ఐపీఎల్‌లో ఆడినోళ్లను, సోషల్ మీడియాలో హైలెట్ అయినోళ్లను సెలెక్ట్ చేస్తున్నారు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో రాజకీయాలు కూడా జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నప్పటికీ అవి ఎంత వరకు నిజం అనేది చెప్పలేం. కానీ, ఇలాంటి పరిస్థితులు కచ్చితంగా ఎలాంటి జట్టునైనా అధపాతాళానికి తీసుకువెళ్లుందనేది మాత్రం నిజం. ఇప్పటికైనా సెలెక్టర్లు, బీసీసీఐ జాగ్రత్త పడితే తప్ప టీమిండియా తన లెగసీని కొనసాగించలేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి