IPL 2027 : హార్దిక్ పాండ్యా ఔట్.. తిలక్ వర్మ ఇన్? ఐపీఎల్ 2027కు ముందు కెప్టెన్లుగా మారే స్టార్ ప్లేయర్లు వీళ్లే

IPL 2027 : ఈ సీజన్ చాలా జట్లకు కెప్టెన్సీ పరంగా పెద్ద తలనొప్పిగా మారింది. లక్నో సూపర్ జాయింట్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవడంతో రిషభ్ పంత్ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2027 సీజన్ కోసం కనీసం ఐదు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను మార్చడానికి ప్లాన్ చేస్తున్నాయి.

IPL 2027 : హార్దిక్ పాండ్యా ఔట్.. తిలక్ వర్మ ఇన్? ఐపీఎల్ 2027కు ముందు కెప్టెన్లుగా మారే స్టార్ ప్లేయర్లు వీళ్లే
Ipl 2027

Updated on: Jun 03, 2026 | 8:04 PM

IPL 2027 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో ఐపీఎల్ 2026 సీజన్ ఘనంగా ముగిసింది. మధ్యప్రదేశ్ క్రేజీ క్రికెటర్ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ ఈ ఘనత సాధించడంతో అతనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ సీజన్ చాలా జట్లకు కెప్టెన్సీ పరంగా పెద్ద తలనొప్పిగా మారింది. లక్నో సూపర్ జాయింట్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవడంతో రిషభ్ పంత్ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2027 సీజన్ కోసం కనీసం ఐదు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను మార్చడానికి ప్లాన్ చేస్తున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు మళ్లీ కేఎల్ రాహుల్ చేతికి?

ఐపీఎల్ 2025లోనే కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరారు. రిషభ్ పంత్ జట్టును వదిలి వెళ్లినప్పుడు రాహుల్ కెప్టెన్ అవుతాడని అందరూ భావించినా, లక్నోతో ఉన్న పాత చేదు అనుభవాల వల్ల అతను ఆ పదవిని వద్దనుకున్నాడు. దీంతో అక్షర్ పటేల్ కెప్టెన్ అయ్యాడు. కానీ గత రెండు సీజన్లుగా అక్షర్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు పెద్దగా రాణించలేదు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ 6వ స్థానంలో నిలిచింది. ఈక్వేషన్స్ ప్రకారం ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నా.. అక్షర్ మధ్యలోనే ఆశలు వదిలేయడం మేనేజ్‌మెంట్‌కు నచ్చలేదు. జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు చేపట్టనుండటంతో ఐపీఎల్ 2027 లో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెప్టెన్‌గా 64 మ్యాచ్‌ల్లో 32 విజయాలు అందుకున్న మంచి రికార్డు రాహుల్ సొంతం.

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‎గా రింకూ సింగ్

ఐపీఎల్ 2026 సీజన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అత్యంత దారుణంగా ప్రారంభమైంది. మొదటి ఐదు మ్యాచ్‌ల్లోనే కేకేఆర్ ఓడిపోవడంతో కెప్టెన్ అజింక్యా రహానేపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత జట్టు పుంజుకున్నా 7వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రహానే వయసు ప్రస్తుతం 30 దాటిపోవడం, పైగా బ్యాటింగ్‌లో 14 ఇన్నింగ్స్‌లలో కేవలం 355 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచడంతో వచ్చే సీజన్‎లో అతడిని కేకేఆర్ వదిలేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2026కి ముందే వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రింకూ సింగ్, ఐపీఎల్ 2027లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.

లక్నో సూపర్ జాయింట్స్‌కు మిచెల్ మార్ష్ లీడర్

రిషభ్ పంత్ రాజీనామా చేయడంతో లక్నో సూపర్ జాయింట్స్ జట్టు కొత్త కెప్టెన్ కోసం వేట మొదలుపెట్టింది. మేనేజ్‌మెంట్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ పేర్లను పరిశీలిస్తోంది. అయితే ఇందులో మిచెల్ మార్ష్ రేసులో ముందున్నాడు. లక్నో జట్టు చరిత్రలోనే వరుసగా రెండు సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా మార్ష్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టును అంతర్జాతీయ స్థాయిలో 39 మ్యాచ్‌ల్లో నడిపించి 27 విజయాలు అందించిన అద్భుతమైన కెప్టెన్సీ ట్రాక్ రికార్డు మార్ష్‌కు అదనపు బలంగా మారింది.

ముంబై ఇండియన్స్‌కు తెలుగోడు తిలక్ వర్మ కెప్టెన్?

ముంబై ఇండియన్స్ క్యాంపులో అంతర్గత విభేదాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రదర్శన, ప్రవర్తనపై యాజమాన్యం అస్సలు సంతృప్తిగా లేదు. ఐపీఎల్ 2027కి ముందే హార్దిక్ ముంబై జట్టును వదిలి వెళ్లడం ఖాయమని సమాచారం. ముంబైకి వచ్చిన మూడు ఏళ్లలో హార్దిక్ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయాడు. పైగా గాయాల సమస్యలు పెరిగాయి. సీనియర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ కోసం ఇబ్బంది పడుతుండటంతో, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన ముంబై జట్టుకు మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మను కెప్టెన్ చేయాలని బోర్డు యోచిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ ఇవ్వనున్న ప్యాట్ కమిన్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని స్వయంగా హింట్ ఇచ్చాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టుకు యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు ఉన్నాయి. దేశం కోసం ఆడేందుకే తాను మొగ్గు చూపుతానని, అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ వల్ల ఐపీఎల్‌కు దూరం కాక తప్పదని కమిన్స్ స్పష్టం చేశాడు. ఒకవేళ కమిన్స్ తప్పుకుంటే, ఎస్ఆర్‌హెచ్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం గట్టిగా వినిపిస్తోంది.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us