
IPL 2026 Playoffs Scenario: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 48 ఉత్కంఠభరితమైన పోరాటాలు ముగిశాయి. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలకడగా కొనసాగుతున్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ పదో స్థానంలో ఉండి అభిమానులను నిరాశపరుస్తున్నాయి.
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఆరంభాన్ని పొందింది. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఈ జట్టు, ప్రస్తుతం 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. పంజాబ్ నెట్ రన్‌రేట్ (+0.855) కూడా మెరుగ్గా ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే వీరికి మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే అవసరం. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే పంజాబ్ జట్టు సులభంగా నాకౌట్ దశకు చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్ల తరహాలో బెంగళూరు జట్టు అదరగొడుతోంది. 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు అందుకున్న బెంగళూరు, 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా బెంగళూరు నెట్ రన్‌రేట్ (+1.420) లీగ్‌లోని అన్ని జట్ల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే వీరు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బెంగళూరు టాప్-2లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో ఇబ్బంది పడ్డ హైదరాబాద్, ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలతో అద్భుతంగా పుంజుకుంది. ప్రస్తుతం బెంగళూరుతో సమానంగా విజయపథంలో నడుస్తోంది. తదుపరి మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్, బెంగళూరు వంటి బలమైన జట్లతో వీరు తలపడాల్సి ఉంది. మరో రెండు విజయాలు సాధిస్తే హైదరాబాద్ ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నెట్ రన్‌రేట్ కూడా (+0.644) సానుకూలంగా ఉంది.
రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి పాయింట్ల పట్టికలో కీలకంగా మారింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు గెలిస్తేనే వీరు 18 పాయింట్లతో సురక్షితంగా ఉంటుంది. అదృష్టవశాత్తూ రాజస్థాన్ రాబోయే మ్యాచ్‌లు పట్టికలో దిగువన ఉన్న జట్లతోనే ఉన్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండు విజయాలు సాధించి ఆశలు సజీవంగా ఉంచుకున్నప్పటికీ, టాప్-4లోకి రావాలంటే కఠినమైన సమీకరణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చెన్నై జట్టు 10 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్‌ల్లో కనీసం 3 మ్యాచ్‌లు గెలవాలి. ఒకవేళ నాలుగు మ్యాచ్‌లూ గెలిస్తే ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ చేరుకోవచ్చు. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి క్లిష్టంగా మారింది. చెన్నై చేతిలో ఓటమి పాలైన తర్వాత నెట్ రన్‌రేట్ (-0.949) భారీగా పడిపోయింది. అక్షర్ పటేల్ సేన మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే తప్ప ముందుకు వెళ్లడం కష్టం.
ఈ సీజన్‌లో కోల్‌కతా ప్రయాణం పట్టాలు తప్పినట్లు కనిపిస్తోంది. ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి. ప్రస్తుత ఫామ్, ఇతర జట్ల బలాబలాలు చూస్తుంటే ఇది దాదాపు అసాధ్యమనిపిస్తోంది. ఒక్క ఓటమి ఎదురైనా కోల్‌కతా అధికారికంగా రేసు నుంచి తప్పుకుంటుంది.
ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్‌ల్లో కేవలం 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తోంది. మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలిచినా గరిష్టంగా 14 పాయింట్లే సాధించగలదు. ఇవి ప్లేఆఫ్స్ చేరడానికి సరిపోవు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా 6 ఓటములతో పట్టికలో అట్టడుగున ఉంది. దాదాపుగా ఈ రెండు జట్ల ప్రయాణం ఈ సీజన్‌లో ముగిసినట్లేనని చెప్పవచ్చు.
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు చివరి బంతి వరకు ఉత్కంఠ రేపడం ఖాయం. పంజాబ్, బెంగళూరు ఆధిపత్యం కొనసాగిస్తుంటే, సన్‌రైజర్స్, చెన్నై జట్లు తమ స్థానాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..