
IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్ రేసులో నిలిచాయి. మిగిలిన 6 జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే ఈ సీజన్ లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి అత్యధిక ఫోర్లు కొట్టిన మొదటి ఐదు స్థానాల్లో పూర్తిగా భారత ఆటగాళ్లే ఆధిపత్యం చలాయించడం విశేషం. విదేశీ ఆటగాళ్లలో మిచెల్ మార్ష్ 13 ఇన్నింగ్స్‌లలో 51 ఫోర్లతో ఓవరాల్ జాబితాలో 8వ స్థానంలో నిలిచాడు.
సాయి సుదర్శన్
గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ 14 ఇన్నింగ్స్‌లలో 62 ఫోర్లతో ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సుదర్శన్ 1 సెంచరీ, 7 హాఫ్ సెంచరీల సహాయంతో మొత్తం 638 పరుగులు సాధించాడు. ఇందులో 29 సిక్సర్లు కూడా ఉన్నాయి.
విరాట్ కోహ్లీ
బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 14 ఇన్నింగ్స్‌లలో 59 ఫోర్లతో రెండో స్థానంలో నిలిచాడు. అతను మొదటి స్థానంలో ఉన్న సాయి సుదర్శన్ కంటే కేవలం 3 ఫోర్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు తలపడనుండటంతో నెంబర్ 1 స్థానం కోసం గట్టి పోటీ జరగనుంది. కోహ్లీ ఈ సీజన్‌లో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 557 పరుగులు చేశాడు.
శుభ్‌మన్ గిల్
గుజరాత్ టైటాన్స్ సారథి శుభ్‌మన్ గిల్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతను ఈ సీజన్‌లో ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో 57 ఫోర్లు బాదాడు. గిల్ మొత్తం 6 హాఫ్ సెంచరీల సహాయంతో 616 పరుగులు చేసి తన జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇషాన్ కిషన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా శుభ్‌మన్ గిల్‌తో సమానంగా 57 ఫోర్లతో నాల్గో స్థానాన్ని ఆక్రమించాడు. అతను ఈ సీజన్ లో ఆడిన 14 ఇన్నింగ్స్‌లలో 6 హాఫ్ సెంచరీలతో మొత్తం 569 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు టాప్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించాడు.
కేఎల్ రాహుల్
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 14 ఇన్నింగ్స్‌లలో 56 ఫోర్లతో ఐదో స్థానంలో నిలిచాడు. అతని జట్టు లీగ్ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగినప్పటికీ, రాహుల్ వ్యక్తిగతంగా మంచి ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ లో అతను 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో మొత్తం 593 పరుగులు సాధించాడు.
సిక్సర్ల కింగ్ వైభవ్ సూర్యవంశీ స్థానం ఎక్కడ?
రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఫోర్లు కొట్టడంలో వెనకబడ్డాడు. అతను 14 ఇన్నింగ్స్‌లలో 50 ఫోర్లతో ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. అయితే సిక్సర్లు కొట్టడంలో మాత్రం అతను 53 సిక్సర్లతో టోర్నమెంట్‌లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టడానికి వైభవ్ మరో 7 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. వైభవ్ ఈ సీజన్ లో సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో 583 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..