LSG vs RCB IPL 2026 : ఓడితే ప్యాక్ చేసుకోవడమే.. లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు

LSG vs RCB IPL 2026 : లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఈ సీజన్ ఒక పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో ఏకంగా 7 ఓటములతో కుంగిపోయింది. లక్నో జట్టుకు ఇప్పుడు కేవలం 5 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఈరోజు మ్యాచ్‌తో సహా అన్ని మ్యాచ్‌లలో గెలిస్తేనే 14 పాయింట్లకు చేరుకుంటుంది.

LSG vs RCB IPL 2026 : ఓడితే ప్యాక్ చేసుకోవడమే.. లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
Lsg Vs Rcb

Updated on: May 07, 2026 | 3:03 PM

LSG vs RCB IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ బెర్తుల కోసం జట్ల మధ్య పోటీ తీవ్రమైంది. ఈ క్రమంలో ఈరోజు లక్నోలోని ఏకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనున్న 50వ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లక్నో జట్టు భవితవ్యాన్ని తేల్చేయనుంది. ఒకవేళ ఈరోజు బెంగళూరు చేతిలో లక్నో ఓడిపోతే, ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన మొదటి జట్టుగా లక్నో నిలుస్తుంది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఈ సీజన్ ఒక పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో ఏకంగా 7 ఓటములతో కుంగిపోయింది. గత మ్యాచ్‌లో బ్యాటర్లు 228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, బౌలర్లు దానిని కాపాడుకోలేకపోయారు. లక్నో జట్టుకు ఇప్పుడు కేవలం 5 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఈరోజు మ్యాచ్‌తో సహా అన్ని మ్యాచ్‌లలో గెలిస్తేనే 14 పాయింట్లకు చేరుకుంటుంది. కానీ, నేడు బెంగళూరు చేతిలో ఓడితే ఆ జట్టు గరిష్టంగా 12 పాయింట్లకే పరిమితం అవుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ (14), పీబీకేఎస్ (13) కంటే వెనుకబడిపోవడంతో లక్నో ప్రయాణం ముగిసిపోతుంది.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది రజత్ పాటిదార్ సారథ్యంలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ విషయంలో అందరికంటే ముందుంది. ఒకవేళ నేడు లక్నోను ఓడిస్తే, బెంగళూరు ఏకంగా టేబుల్ టాప్ పొజిషన్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ బ్యాటర్లు ఫామ్‌లో ఉండటం, బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటం ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్.

చరిత్రను పరిశీలిస్తే లక్నో కంటే బెంగళూరుదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగగా.. బెంగళూరు 5 సార్లు, లక్నో కేవలం 2 సార్లు మాత్రమే గెలిచాయి. ముఖ్యంగా ఏకానా స్టేడియంలో బెంగళూరుపై లక్నోకు ఒక్క గెలుపు కూడా లేదు. ఈ ఏడాది తన సొంత మైదానంలో ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా లక్నో విజయం సాధించలేకపోవడం ఆ జట్టు అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా 12 పాయింట్లతో పోటీలో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా 14 పాయింట్లకు చేరుకుంటుంది. అంటే లక్నో ఈరోజు ఓడితే మిగిలిన అన్ని జట్లు లక్నో కంటే ఎక్కువ పాయింట్లతో ఉండటంతో, అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి లక్నో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us