
Ishan Kishan : ఐపీఎల్ 2026 లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన అద్భుత విజయం వెనుక ఒక గుండెను పిండేసే ఎమోషనల్ స్టోరీ దాగుంది. చెన్నై హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలవడమే కాకుండా ప్లేఆఫ్స్ బెర్తును కూడా దాదాపు ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపు అర్ధశతకంతో (70 పరుగులు) జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత తను ఆడిన ఈ ఇన్నింగ్స్ వెనుక ఉన్న అసలు మోటివేషన్ ఏంటో చెప్తూ ఇషాన్ కిషన్ భావోద్వేగానికి లోనయ్యాడు.
కజిన్స్ కోసమే ఈ పోరాటం..
మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ఈ ఇన్నింగ్స్‌ను తన కజిన్స్‌కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తన కజిన్ సిస్టర్, ఆమె భర్త ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోర విషాదం తర్వాత ఇషాన్ కిషన్ కజిన్స్ మొదటిసారిగా ఈ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వచ్చారు. “నా కజిన్స్ స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్నారు. సోదరిని కోల్పోయిన బాధలో ఉన్న వారికి ఈ గెలుపుతో కొంచెమైనా ఉపశమనం కలిగించాలనుకున్నాను. వారి కోసమే క్రీజులో చివరి వరకు నిలబడి మ్యాచ్ ముగించాలనుకున్నాను” అని ఇషాన్ ఎంతో ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.
టి20 వరల్డ్ కప్‌లోనూ ఇదే విషాదం
నిజానికి టి20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందే ఇషాన్ కిషన్ సోదరి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ గుండె కోతను అనుభవిస్తూనే, దేశం కోసం ఇషాన్ కిషన్ మరుసటి రోజు న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లోనూ అద్భుత హాఫ్ సెంచరీ చేసి, ఆ ఇన్నింగ్స్‌ను చనిపోయిన తన సోదరికి అంకితం ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌లో తన కజిన్స్ కళ్ల ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును గెలిపించి, ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.
చెన్నై ఎండల్లో కిషన్ విశ్వరూపం
చెన్నై వేడి వాతావరణంలో, స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇషాన్ కిషన్ చెన్నై బౌలర్లను చీల్చి చెండాడాడు. 181 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి మూడో వికెట్‌కు నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మైదానంలో దూకుడుగా కనిపించే ఈ యంగ్ ప్లేయర్ వెనుక ఇంతటి ఎమోషనల్ పెయిన్ ఉందా అని తెలిసి తోటి ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు కూడా కిషన్‌ను అభినందిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..