IPL 2022: దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రపంచంలోని గొప్ప బౌలర్లలో ఒకటిగా పేరుగాంచాడు. అతను తన బంతులతో ప్రపంచంలోని ప్రతి మూలలో విధ్వంసం సృష్టించాడు. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ని కూడా భయపెట్టే బౌలర్లలో స్టెయిన్ ఒకడు. ఇప్పుడు ఈ బౌలర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పునరాగమనం చేయబోతున్నాడు. అయితే ఆటగాడిగా మాత్రం కాదు. కోచ్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌తో జతకట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం ఐపీఎల్ తదుపరి సీజన్‌లో స్టెయిన్ తన పాత జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్‌గా కనిపించవచ్చు. ఇప్పటికే ఫ్రాంచైజీ స్టెయిన్‌తో మాట్లాడిందని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీ వచ్చే వారంలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఆగస్టులో స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో మొత్తం 95 మ్యాచ్‌లు ఆడాడు. డెక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అతను ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి టామ్ మూడీతో కలిసి సన్‌రైజర్స్ సిబ్బందిలో పని చేస్తాడు. క్రిక్‌బజ్ తన నివేదికలో స్టెయిన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారని, అయితే అతను సందేశానికి స్పందించలేదని రాసుకొచ్చారు. అయితే ఈ విషయానికి సంబంధించిన ఐపీఎల్ అధికారి స్టెయిన్ ఆ పదవిని స్వీకరిస్తారని ధృవీకరించారు.
కోచింగ్ స్టాఫ్‌లో ఈ భారతీయుడు కూడా..
భారత మాజీ ఆల్‌రౌండర్ తమిళనాడుకు చెందిన హేమంగ్ బదానీ కూడా సన్‌రైజర్స్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో చేరనున్నట్లు వెబ్‌సైట్ తన నివేదికలో పేర్కొంది. గత సీజన్‌లో ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్, బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ తమ పదవులకు రాజీనామా చేయడంతో ప్రస్తుతం జట్టుకు కొత్త కోచింగ్ సిబ్బంది అవసరం ఏర్పడింది. అలాగే వీవీఎస్ లక్ష్మణ్ వచ్చే సీజన్‌లో జట్టుతో ఉండడు. లక్ష్మణ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్‌గా చేరడంతో, ఎస్‌ఆర్‌హెచ్ ఆయన సేవలను కోల్పోయింది. మూడీ గత సీజన్‌లో సన్‌రైజర్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను ప్రధాన కోచ్ పాత్రలో కనిపించనున్నాడు.
2016లో సన్‌రైజర్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అప్పటి నుంచి ఆ జట్టు టైటిల్ వేటలో విఫలమైంది. గత సీజన్‌లో ఆ జట్టు ప్లేఆఫ్‌కు కూడా చేరలేకపోయింది. సీజన్ మధ్యలో కెప్టెన్సీ మార్పు జరిగింది. డేవిడ్ వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్సీని అప్పగించారు.
స్టెయిన్ కెరీర్..
స్టెయిన్ కెరీర్ గురించి మాట్లాడితే, దక్షిణాఫ్రికా తరపున 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 439 వికెట్లు పడగొట్టాడు. వన్డేలలో 196 వికెట్లు తీయగా, 125 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. మరోవైపు, టీ20 విషయానికి వస్తే, స్టెయిన్ మొత్తం 47 మ్యాచ్‌లు ఆడి 64 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Harkirat Singh Bajwa: భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాడు.. అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు..