Cricket Stadium : తొక్కిసలాట తర్వాత కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.2350 కోట్లతో ఇంటర్నేషనల్ స్టేడియం

బెంగుళూరు సమీపంలోని ఆనేకల్ తాలూకాలో భారీ స్టేడియం నిర్మించనున్నారు. సుమారు రూ.2,350 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, క్రీడా సముదాయాన్ని నిర్మించడానికి కర్ణాటక మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేబినెట్ మీటింగ్ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్.కె. పాటిల్ వెల్లడించారు.

Cricket Stadium : తొక్కిసలాట తర్వాత కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.2350 కోట్లతో ఇంటర్నేషనల్ స్టేడియం
Anekal International Cricket Stadium

Updated on: Oct 17, 2025 | 12:22 PM

Cricket Stadium : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన తరువాత, బెంగళూరులోని ఎం.చిన్నస్వామి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సామర్థ్యం, భద్రతపై తీవ్ర అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో గురువారం (అక్టోబర్ 16) జరిగిన కర్ణాటక మంత్రివర్గం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నగరంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, క్రీడా సముదాయం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

బెంగుళూరు జిల్లాలోని ఆనేకల్ తాలూకాలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. సుమారు రూ.2,350 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, క్రీడా సముదాయాన్ని నిర్మించడానికి మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ఈ వివరాలను సమావేశానంతరం మంత్రి హెచ్.కె. పాటిల్ వెల్లడించారు. ఇండ్లవాడి గ్రామంలోని సూర్యనగర్ నాల్గవ దశ విస్తరణలో మొత్తం 75 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టేడియం నిర్మించాలని గృహనిర్మాణ శాఖ ప్రతిపాదించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

కర్ణాటకలో మైసూర్, తుమకూరులలో నిర్మాణంలో ఉన్న స్టేడియంల తర్వాత, ఇది రాష్ట్రంలో మూడవ అంతర్జాతీయ స్టేడియం కానుంది. గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కొత్తగా నిర్మించబోయే ఈ స్టేడియం 80,000 మంది ప్రేక్షకుల కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇది 24 ఇండోర్, అవుట్‌డోర్ క్రీడలకు అవసరమైన సౌకర్యాలను కలిగి ఉంటుంది. అదనంగా 3,000 సీట్ల కెపాసిటీ గల ఒక అసెంబ్లీ హాల్ కూడా నిర్మించనున్నారు. ఇంటర్నేషనల్ లెవల్ సౌకర్యాలతో ఇది దేశంలోనే అతి పెద్ద క్రీడా సముదాయాల్లో ఒకటిగా నిలవనుంది.

బెంగుళూరులో ప్రస్తుతం ఉన్న ఎం. చిన్నస్వామి స్టేడియం కేవలం 38,000 మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించగలదని గృహనిర్మాణ శాఖ డాక్యుమెంట్లు పేర్కొంటున్నాయి. చిన్న నగరాలు కూడా దీనికంటే పెద్ద స్టేడియంలను కలిగి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ గెలుపు తర్వాత జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తరువాత చిన్నస్వామి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచులు జరుగలేదు. ఈ ఘటన, స్టేడియం కెపాసిటీ పై ఉన్న ఆందోళనల కారణంగానే ప్రభుత్వం ఈ కొత్త, పెద్ద స్టేడియం నిర్మాణానికి చొరవ తీసుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం డీపీఆర్, ఫీసబిలీటీ స్టడీ రెడీ చేయాలని సంబంధిత శాఖను మంత్రివర్గం ఆదేశించింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..