
Jeet Raval: భారత్‌లో జన్మించిన న్యూజిలాండ్ ప్రసిద్ధ క్రికెటర్ జీత్ రావల్ అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 38 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ తన సుదీర్ఘ ఆట జీవితానికి ముగింపు పలకడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన ప్రదర్శన, సాధించిన విజయాల పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని రావల్ స్వయంగా వెల్లడించారు.
గుజరాత్ నుంచి న్యూజిలాండ్
జీత్ రావల్ గుజరాత్‌లో జన్మించారు. ఆయన చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. గుజరాత్‌లో ఉన్నప్పుడు భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చదువుకున్న స్కూల్‌లోనే జీత్ రావల్ కూడా ప్రాథమిక విద్యను అభ్యసించడం విశేషం. న్యూజిలాండ్ దేశానికి ప్రాతినిధ్యం వహించడమనేది కేవలం తన కల మాత్రమే కాదని, తన తండ్రి ఆశయం కూడా అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అంతర్జాతీయ టెస్టు కెరీర్ విశేషాలు
న్యూజిలాండ్ జాతీయ జట్టు తరఫున జీత్ రావల్ అంతర్జాతీయ స్థాయిలో 24 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఓపెనింగ్ బ్యాటర్‌గా 39 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు సాయంతో మొత్తం 1,143 పరుగులు చేశారు. నవంబర్ 2016లో పాకిస్థాన్‌పై టెస్టు అరంగేట్రం చేసిన రావల్, మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే 55 పరుగులు సాధించి ఆకట్టుకున్నారు. ఆయన చివరి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ 2020లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లెజెండ్
అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా ఫస్ట్ క్లాస్ డొమెస్టిక్ క్రికెట్‌లో జీత్ రావల్ అద్భుతమైన రికార్డు నమోదు చేశారు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఏకంగా 164 మ్యాచ్‌లు ఆడి 24 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీల సాయంతో 10,432 పరుగులు రాబట్టారు. ఇందులో ఆయన బ్యాటింగ్ సగటు 47.91గా ఉండటం ఆయన స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనం.
ఆనందంగా వీడ్కోలు చెబుతున్నానన్న రావల్
రిటైర్మెంట్ సందర్భంగా జీత్ రావల్ మాట్లాడుతూ, “న్యూజిలాండ్ జట్టుకు ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రయాణం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. అనుకున్న లక్ష్యాలను సాధించిన తర్వాత ఆనందంగా ఆటకు వీడ్కోలు పలకడం ఎంతో సంతృప్తిని ఇస్తోంది” అని వ్యాఖ్యానించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..