IND vs WI 5th T20I: టీమిండియా ప్లేయింగ్ 11 అదుర్స్.. కానీ, పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం..!
India playing XI vs West Indies: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ 2-2తో సమంగా ఉంది. బెంగళూరులో జరగనున్న ఐదో, ఆఖరి టీ20 మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. టీమిండియాలో అర్ష్దీప్ సింగ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఆడే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్కు బెంగళూరులో భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇది అభిమానులను నిరాశపరిచే అవకాశం ఉంది.

India playing XI vs West Indies: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఉత్కంఠభరితంగా, రసవత్తరంగా సాగుతోంది. తొలి టి20లో లక్నో వేదికగా భారత్ విజయం సాధించగా, రాంచీలో జరిగిన రెండో మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు గెలిచి సిరీస్ను సమం చేసింది. అనంతరం ఇండోర్లో జరిగిన మూడో మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయం సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, హైదరాబాద్ వేదికగా జరిగిన నాలుగో టి20లో వెస్టిండీస్ విజయం సాధించి సిరీస్ను మళ్ళీ 2-2తో సమం చేసింది. దీంతో, ఇరు జట్ల మధ్య ఈరోజు జరగనున్న ఐదో టి20 మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది.
ఈ కీలక పోరుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఒకే ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ గాయం కారణంగా ఈ చివరి టి20లో ఆడే అవకాశం లేదు. టీం మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అర్ష్దీప్ స్థానంలో అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్లో బెంగళూరును తన హోమ్ గ్రౌండ్గా భావించే భువనేశ్వర్ కుమార్, ఈ ఐదో టి20లో చెలరేగితే టీమిండియాకు విజయం తథ్యమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత జట్టులోకి వచ్చిన భువనేశ్వర్ తన అనుభవంతో కీలక పాత్ర పోషించగలడని అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ మ్యాచ్ను వరుణుడు అడ్డుకునే ప్రమాదం తీవ్రంగా ఉంది. బెంగళూరులో నిన్న శుక్రవారం భారీగా వర్షం కురిసింది, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దయింది. ఇక ఈరోజు శనివారం సైతం వర్షం పడే సూచనలు ఉన్నట్లు ఆక్యూ వెదర్ తెలిపింది. బెంగళూరులో ఈరోజు వర్షం పడేందుకు 80 నుంచి 90 శాతం అవకాశం ఉన్నట్లు అంచనా. మధ్యాహ్నం 12 గంటల వరకు 11 శాతం వర్షం పడే అవకాశం ఉండగా, ఆ తర్వాత రెండు గంటల్లో 35 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు మొదలు కానుండగా, ఆ సమయంలో వర్షం పడేందుకు 80 శాతం అవకాశం ఉందని ఆక్యూ వెదర్ అంచనా వేసింది. రాత్రి 11 గంటల వరకు కూడా వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో బెంగళూరులో భారత్ వెస్టిండీస్ మ్యాచ్ చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్నదైన చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద చూద్దామనుకుంటే వర్షం వల్ల అంతా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఏది ఏమైనా, వర్షం లేకుండా మ్యాచ్ సజావుగా జరిగితే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండే అవకాశం ఉంది: ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శ్యాంసన్ మరోసారి బరిలోకి దిగనున్నారు. దీంతో వైభవ్ సూరవంశికి ఈ సిరీస్ నుంచి బెంచ్కే పరిమితమైనట్టయింది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఆ తర్వాత ఆల్ రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్ తుది జట్టుకి ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలర్లుగా ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ తో పాటు భువనేశ్వర్ కుమార్ జట్టులో ఉండే అవకాశం ఉంది. ఈ కీలక మ్యాచ్ జరిగి, టీమిండియా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
