IND vs ENG : 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లీ.. వయసు పెరిగినా తగ్గని కసి.. పాండ్యా గాయంతో దూబేకు లక్కీ ఛాన్స్

IND vs ENG : ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. టీ20 సిరీస్ ఓటమి తర్వాత భారత్ విజయాల బాట పట్టాలని చూస్తోంది. హార్దిక్ పాండ్యా గాయం నేపథ్యంలో శివమ్ దూబేకు అవకాశం లభించగా, బుమ్రా జట్టుకు కీలక బలంగా మారనున్నాడు.

IND vs ENG : 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లీ.. వయసు పెరిగినా తగ్గని కసి.. పాండ్యా గాయంతో దూబేకు లక్కీ ఛాన్స్
Ind Vs Eng

Updated on: Jul 13, 2026 | 4:34 PM

IND vs ENG : భారత క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14 (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. మొదటి వన్డే మ్యాచ్‌కు బర్మింగ్‌హామ్ వేదిక కాబోతోంది. ఇటీవల ముగిసిన టీ20 పర్యటనలో భారత జట్టు ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడిన 7 మ్యాచ్‌లలో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా, మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోయింది. ఐర్లాండ్‌తో రెండు, ఇంగ్లాండ్‌తో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాను తిరిగి విజయాల బాట పట్టించేందుకు దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డే జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు.

హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ప్రస్తుతం 39 ఏళ్లు, విరాట్ కోహ్లీకి త్వరలో 38 ఏళ్లు రాబోతున్నాయి. వయసు పైబడుతున్నా వీరిద్దరిలో పరుగుల దాహం, క్రికెట్ పై ఉన్న జోష్ అస్సలు తగ్గలేదు. ఇప్పటికీ ప్రపంచ వన్డే క్రికెట్‌లో వీరిద్దరే అత్యంత అత్యుత్తమ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్‎లో భారత్‌ను విజేతగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇద్దరు సీనియర్లు.. ఈ సిరీస్ ద్వారా ఇంగ్లాండ్ గడ్డపై తమ పట్టు నిరూపించుకోవాలని చూస్తున్నారు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వంటి ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను వారి సొంత పిచ్‌లపై ఎదుర్కోవడం సవాలే అయినా, గత రికార్డులను బట్టి చూస్తే రోహిత్, కోహ్లీలు ఇంగ్లీష్ బౌలర్లను చితక్కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ వన్డే సిరీస్‌కు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చూస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల తోడుగా అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ల రూపంలో భారత్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అయితే ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లు టీ20 సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిరాశపరిచారు. అయినప్పటికీ వారి బ్యాటింగ్ సామర్థ్యాన్ని నమ్మి మేనేజ్‌మెంట్ వారికి మరో అవకాశం ఇవ్వనుంది. గాయపడిన హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో నాలుగో పేసర్‌గా శివమ్ దూబే జట్టులో కొనసాగనున్నాడు.

గత కొన్ని మ్యాచ్‌లుగా బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్న భారత్‌కు స్టార్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా రాక కొండంత అండగా మారింది. బుమ్రాతో పాటు లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, యువ బౌలర్లు గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌లతో పేస్ విభాగం బలంగా ఉంది. ఇక స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్ నడిపించనున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు గత జనవరి 27 నుంచి ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20 సిరీస్ గెలిచిన ఊపులో ఉన్నప్పటికీ, వన్డే ఫార్మాట్‌కు తగ్గట్టుగా లయ అందుకోవడం వారికి కాస్త సమయం పట్టవచ్చు. ఇంగ్లాండ్ జట్టుకు జో రూట్ రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతం కాగా హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? లైవ్ ఎక్కడ చూడాలి?

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే ఈ మొదటి వన్డే మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్ మ్యాచ్‌ల డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్‌లను లైవ్‌లో జియో హాట్‌స్టార్ యాప్, వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు.

ఇరు జట్ల వివరాలు :

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.

ఇంగ్లాండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), టామ్ బాంటన్, జో రూట్, జాకబ్ బెథెల్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us