IND vs PAK U19: మరికొద్దిసేపట్లో హైఓల్టేజీ మ్యాచ్.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?
India U19 vs Pakistan U19: అండర్-19 ఆసియా కప్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం (నవంబర్ 8) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు రెండు జట్ల మధ్య ఉన్న హెడ్ టు హెడ్ రికార్డులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన పోరుల్లో భారత జట్టుదే పైచేయిగా నిలిచింది.

India U19 vs Pakistan U19: అండర్-19 ఆసియా కప్ 2026 (U19 Asia Cup 2026)లో దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది. భారత్ అండర్-19 (India U19), పాకిస్థాన్ అండర్-19 (Pakistan U19) జట్లు నవంబర్ 8న అమీరాత్‌లో తలపడనున్నాయి. ఈ టోర్నీలో గ్రూప్-ఏలో ఉన్న ఇరు జట్లు ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడాయి. తమ తొలి మ్యాచుల్లో విజయాలు సాధించడంతో రెండేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే పోరు గ్రూప్‌లో అగ్రస్థానం కోసం కీలకంగా మారింది.
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఏకంగా 191 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. అయితే ఆ తర్వాత జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు మరోసారి పాక్‌ను ఓడించి గ్రూప్‌లో ఆధిపత్యం చెలాయించాలని భారత యువ జట్టు భావిస్తోంది.
హెడ్ టు హెడ్ రికార్డుల్లో భారత్ ముందంజ
యూత్ వన్డేల్లో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు 30 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 17 విజయాలు సాధించగా, పాకిస్థాన్ 12 మ్యాచుల్లో గెలిచింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ గణాంకాలు దాయాదుల పోరులో భారత జట్టుకు ఉన్న ఆధిపత్యాన్ని తెలియజేస్తున్నాయి.
అత్యధిక, అత్యల్ప స్కోర్లు ఇవే!
ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో పాకిస్థాన్ అత్యధికంగా 347/8 పరుగులు చేసింది. 2025 అండర్-19 ఆసియా కప్‌లో ఈ స్కోరు నమోదు చేసింది. ఇక 2018 అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ నిర్దేశించిన 272/9 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ కేవలం 69 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 203 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.
వ్యక్తిగత రికార్డుల్లో సమీర్ మిన్హాస్
2025 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ (Sameer Minhas) 113 బంతుల్లో 172 పరుగులు సాధించాడు. ఈ రెండు జట్ల మధ్య యూత్ వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. బౌలింగ్‌లో పాకిస్థాన్ ఆటగాడు అన్వర్ అలీ (Anwar Ali) 2006లో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
పరుగులు, వికెట్లలో వీళ్లదే రికార్డు
భారత్‌పై పాకిస్థాన్ మాజీ ఆటగాడు సామి అస్లాం (Sami Aslam) ఆరు ఇన్నింగ్స్‌ల్లో 514 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా (Piyush Chawla) పాకిస్థాన్‌పై ఏడు ఇన్నింగ్స్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. 3.96 ఎకానమీతో బౌలింగ్ చేసి అత్యుత్తమంగా 8 పరుగులకు 4 వికెట్లు సాధించాడు.
చివరి పోరులో ఎవరు రాణించారు?
2026 అండర్-19 ప్రపంచకప్‌లో ఇరు జట్లు చివరిసారిగా తలపడినప్పుడు భారత బ్యాటర్ వేదాంత్ త్రివేది (Vedant Trivedi) 98 బంతుల్లో 68 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్ అబ్దుల్ సుభాన్ (Abdul Subhan) 33 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈసారి జరిగే పోరులోనూ వీరి ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
