IND vs AFG: రోహిత్‌ ఔట్.. శాంసన్‌ ఇన్.. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..?

India Predicted Squad vs Afghanistan: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తదుపరి అంతర్జాతీయ సిరీస్‌లపై దృష్టి సారించింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సెలక్టర్లు సరికొత్త వ్యూహాలతో జట్టును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లకు విశ్రాంతినిస్తూనే, యువ సంచలనాలకు ఈ సిరీస్‌లో పెద్దపీట వేయనున్నారు.

IND vs AFG: రోహిత్‌ ఔట్.. శాంసన్‌ ఇన్.. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..?
Team India

Updated on: May 18, 2026 | 3:29 PM

India Predicted Squad vs Afghanistan: అఫ్గానిస్తాన్ పర్యటన జూన్ 6 నుంచి 10 వరకు జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూన్ 14 నుంచి 20 వరకు ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ కోసం ప్రకటించబోయే భారత జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ మోకాలి నరాల నొప్పితో (హామ్‌స్ట్రింగ్) బాధపడుతున్న సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. అతని వయసు, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుని సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. రోహిత్ స్థానంలో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.

విరాట్ కోహ్లీ కంటిన్యూ.. సంజూ శాంసన్‌కు బంపర్ ఆఫర్..!

ప్రస్తుతం 37 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మాత్రం ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ మధ్య కాలంలో వన్డే ఫార్మాట్ మ్యాచ్‌లు తక్కువగా జరుగుతుండటంతో, పరుగుల వరద పారించడానికి కోహ్లీ ఈ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. మరోవైపు వికెట్ కీపర్ స్థానంలో రిషభ్ పంత్ స్థానంలో కేరళ స్టార్ సంజూ శాంసన్‌కు మళ్లీ పిలుపు వచ్చే అవకాశం ఉంది. మరో కీపర్‌గా కేఎల్ రాహుల్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేయనున్నాడు.

ఇది కూడా చదవండి: ఇది కదా ట్విస్ట్ అంటే.. SRH గెలిస్తే ప్లేఆఫ్స్‌కు 2 జట్లు.. కాటేరమ్మ కొడుకులతో అట్లుంటది మరి..!

ఆల్‌రౌండర్ల విభాగంలో నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా..!

రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు ఇప్పటి నుంచే జట్టును స్థిరీకరించే పనిలో పడ్డారు. ఐపీఎల్ 2026లో బ్యాటుతోనూ, బంతితోనూ అదరగొడుతున్న వాషింగ్టన్ సుందర్ జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోగా, రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను మొదటి ఎంపికగా పరిశీలిస్తున్నారు. ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా వన్డేల్లో అక్షర్ నమ్మకమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వస్తుండగా, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఆల్‌రౌండర్ల కోటాలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

బౌలింగ్ విభాగంలో కొత్త ముఖం.. ప్రిన్స్ యాదవ్‌కు చోటు..?

భారత పేస్ దళాన్ని జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ముందుండి నడిపించనున్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు ప్రిన్స్ యాదవ్. ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న ప్రిన్స్ యాదవ్‌కు అఫ్గానిస్తాన్ సిరీస్ ద్వారా తొలిసారి అంతర్జాతీయ పిలుపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ధోనీ కీలక సంకేతాలు..!

భారత అంచనా వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్, యశస్వి జైస్వాల్.

అఫ్గానిస్తాన్‌తో జరిగే ఈ వన్డే సిరీస్ సీనియర్లతోపాటు యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటడానికి ఒక సువర్ణ అవకాశం. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ సారథ్య బాధ్యతలను ఎలా నిర్వహిస్తాడు, కొత్త ఆటగాడు ప్రిన్స్ యాదవ్ ఎలాంటి ప్రభావం చూపుతాడు అనేది ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us