
Ind A vs SA A: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 సెమీఫైనల్లో ఇండియా ఏ జట్టు అదరగొట్టింది. శ్రీలంక ఏతో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. అభిషేక్ శర్మ, కెప్టెన్ తిలక్ వర్మ, షహబాజ్ అహ్మద్ అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. దీంతో ఫైనల్ చేరాలంటే శ్రీలంక ఏ జట్టు 318 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభం
టాస్ గెలిచిన ఇండియా ఏ కెప్టెన్ తిలక్ వర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ముఖ్యంగా గత మ్యాచ్‌లో యూఏఈపై 28 సిక్సర్లతో 204 పరుగులు చేసిన వైభవ్.. శ్రీలంక బౌలర్లపైనా విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. అభిషేక్‌తో కలిసి తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యంతో భారత్‌కు మంచి పునాది పడింది.
37 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీ
వైభవ్ ఔటైన తర్వాత కూడా అభిషేక్ శర్మ తన దూకుడు తగ్గించలేదు. శ్రీలంక బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు బాదాడు. కేవలం 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరకు 63 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 78 పరుగులు చేసి వెనుదిరిగాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌తో భారత్ స్కోరు వేగంగా పెరిగింది.
తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. తర్వాత వరుస వికెట్లు
కెప్టెన్ తిలక్ వర్మ కూడా బాధ్యతాయుతంగా ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా క్రీజులో నిలబడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. 66 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 53 పరుగులు చేశాడు. కుమార్ కుశాగ్ర 27 బంతుల్లో 21 పరుగులు చేయగా, రింకూ సింగ్ 21 బంతుల్లో 12 పరుగులకే పరిమితమయ్యాడు. సూర్యాంశ్ షెడ్గే 10 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఒక దశలో ఇండియా ఏ జట్టు స్కోరు నెమ్మదించినట్లు కనిపించింది.
షహబాజ్ మెరుపులు
చివరి ఓవర్లలో షహబాజ్ అహ్మద్, తనుష్ కోటియన్ జట్టును ఆదుకున్నారు. వికెట్లు పడుతున్న సమయంలో వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఏడో వికెట్‌కు కేవలం 55 బంతుల్లో 73 పరుగులు జోడించారు. షహబాజ్ 48 బంతుల్లో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. తనుష్ కోటియన్ 30 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో హర్ష్ దూబే కూడా వేగంగా పరుగులు జోడించడంతో భారత్ స్కోరు 300 దాటింది. మొత్తంగా 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. అభిషేక్, తిలక్, షహబాజ్ అర్ధ సెంచరీలు భారత ఇన్నింగ్స్‌లో కీలకంగా నిలిచాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..