
U19 World Cup 2026 : అండర్-19 వన్డే వరల్డ్ కప్ వేదికగా భారత్, అమెరికా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి కారణం అమెరికా జట్టుకు సారథ్యం వహిస్తున్న ఉత్కర్ష్ శ్రీవాస్తవ. ఈ కుర్రాడికి భారత్‌తో విడదీయలేని సంబంధం ఉంది. ఉత్కర్ష్ ఫిబ్రవరి 18, 2007న మహారాష్ట్రలోని పుణేలో జన్మించాడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లినా, క్రికెట్ పట్ల తనకున్న మక్కువతో మళ్ళీ భారత్‌కు వచ్చి ఢిల్లీలో శిక్షణ పొందాడు. ఇప్పుడు అదే భారత్ జట్టును ఓడించడమే లక్ష్యంగా మైదానంలోకి దిగుతున్నాడు.
గత 2024 అండర్-19 వరల్డ్ కప్‌లో కూడా ఉత్కర్ష్ ఆడాడు. ఆ టోర్నీ తర్వాత తన లోపాలను సరిదిద్దుకోవడానికి ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ ప్రముఖ కోచ్ ఎస్.పి.యాదవ్ దగ్గర కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. ట్రైనింగ్ సమయంలో ఢిల్లీలో జరిగిన ఒక టోర్నమెంట్‌లో 10 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 422 పరుగులు బాదాడు. ఇందులో 56 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఇలా భారత్‌లోనే బ్యాటింగ్ పాఠాలు నేర్చుకున్న ఈ పుణే కుర్రాడు.. ఇప్పుడు భారత బౌలర్లనే ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు.
భారత్, అమెరికా జట్లు అండర్-19 స్థాయిలో తలపడటం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2024 వరల్డ్ కప్‌లో సరిగ్గా 717 రోజుల క్రితం (జనవరి 28) ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 201 పరుగుల భారీ తేడాతో అమెరికాను చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో ఆడిన ఉత్కర్ష్, ఒంటరి పోరాటం చేసి 73 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఇప్పుడు కెప్టెన్ హోదాలో జట్టును నడిపిస్తున్న ఉత్కర్ష్.. పాత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఆయుష్ మ్హాత్రే నేతృత్వంలోని ప్రస్తుత భారత జట్టుకు ఉత్కర్ష్ శ్రీవాస్తవ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహం లేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..