ఒక నోబ్, 3 సిక్స్‌లు, ఫోర్‌తో 27 రన్స్.. చెత్త రికార్డుల్లో నంబర్ వన్.. చివరి ఓవర్‌లో టీమిండియా పాలిట విలన్‌గా అర్షదీప్..

|

Jan 28, 2023 | 10:41 AM

Arshdeep Singh: ఈ నెల ప్రారంభంలో, శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో, అర్ష్‌దీప్ సింగ్ నో బాల్, వైడ్ బాల్ కారణంగా విమర్శలకు గురయ్యాడు. ఈసారి కూడా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు.

ఒక నోబ్, 3 సిక్స్‌లు, ఫోర్‌తో 27 రన్స్.. చెత్త రికార్డుల్లో నంబర్ వన్.. చివరి ఓవర్‌లో టీమిండియా పాలిట విలన్‌గా అర్షదీప్..
Hardik Pandya, Arshdeep Sin
Follow us on

India Vs New Zealand: రెండు నెలల క్రితం వరకు ఆస్ట్రేలియా గడ్డపై తన ఘోరమైన బౌలింగ్‌తో భయాందోళనలు సృష్టిస్తూ, భారత ఫాస్ట్ బౌలింగ్‌కు భవిష్యత్తుగా మారిన అర్ష్‌దీప్ సింగ్‌.. కొత్త ఏడాది చాలా చెడ్డదిగా మారింది. శ్రీలంకపై నోబాల్స్‌తో విమర్శలకు గురైన అర్ష్‌దీప్.. ఇప్పుడు న్యూజిలాండ్‌పై కూడా అదే నోబాల్స్‌ వేసి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.

ఈ క్రమంలో భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, నో బాల్‌కు ఉన్న సంబంధం విడదీయలేనిదిగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ తొలి మూడు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అర్ష్‌దీప్‌ తొలి మూడు ఓవర్లలో నో బాల్‌ వేయకుండా కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. అటువంటి పరిస్థితిలో, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతనిపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్‌లో అత్యంత కష్టతరమైన 20వ ఓవర్‌ను విసిరే బాధ్యతను అతనికి ఇచ్చాడు. అర్ష్‌దీప్ ఇక్కడ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. నో బాల్‌తో ఓవర్‌ను ప్రారంభించాడు. ఆఖరి ఓవర్లో మొత్తం 27 పరుగులు ఇచ్చి ఎన్నో చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

తొలి మూడు బంతుల్లో 23 పరుగులు..

అర్ష్‌దీప్ సింగ్ వేసిన చివరి ఓవర్ గురించి మాట్లాడితే, అతను వేసిన మొదటి బంతి నో బాల్‌పై డారెల్ మిచెల్ లాంగ్ ఆన్ దిశలో సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత, అర్ష్‌దీప్ సింగ్ తదుపరి మూడు బంతుల్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో సహా 16 పరుగులు ఇచ్చాడు. తొలి మూడు బంతుల్లో 23 పరుగులు ఇచ్చిన అర్ష్‌దీప్, చివరి మూడు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చినా, అప్పటికి టీమిండియాకు ఓటమి తప్పలేదు. అర్ష్‌దీప్ ఇచ్చిన ఈ 27 పరుగుల కారణంగా న్యూజిలాండ్ జట్టు 176 పరుగుల స్కోరుకు చేరుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

దీంతో భారత్ తరపున 20వ ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. ఈ లిస్టులో 2012లో దక్షిణాఫ్రికాపై 26 పరుగులు ఇచ్చిన మాజీ స్పిన్నర్ సురేశ్ రైనా రికార్డును బ్రేక్ చేశాడు. ఇది మాత్రమే కాదు, ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ సంయుక్తంగా మూడవ స్థానానికి చేరుకున్నాడు.

ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్లు..

27- అర్ష్‌దీప్ సింగ్ 2023

26- సురేష్ రైనా 2012

24- దీపక్ చాహర్ 2022

23- ఖలీల్ అహ్మద్ 2018

23- హర్షల్ పటేల్ 2022

ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్లు..

34 – శివమ్ దూబే vs NZ, 2020

32 – స్టువర్ట్ బిన్నీ vs WI, 2016

27 – శార్దూల్ ఠాకూర్ vs SL, 2018

27 – అర్ష్‌దీప్ సింగ్ vs NZ, 2023

26 – సురేష్ రైనా vs SA, 2012

26 – అర్ష్‌దీప్ vs SA, 2022

26 – యువరాజ్ సింగ్ vs NZ, 2007

అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డుల జాబితాలో మరికొన్ని కూడా చేరాయి. ఈ పేలవమైన ప్రదర్శనతో అతను టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు ఓవర్‌లో 25 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన ఏకైక భారతీయ బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ కంటే ముందు, అర్ష్‌దీప్ సింగ్ గౌహతిలో దక్షిణాఫ్రికాపై 19వ ఓవర్‌లో 26 పరుగులు ఇచ్చాడు.

అర్ష్‌దీప్ సింగ్ టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక నో బాల్‌లు వేసిన బౌలర్‌గా నిలిచాడు. తన చిన్న కెరీర్‌లో ఇప్పటివరకు 15 నో బాల్స్ బౌలింగ్ చేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన హసన్ అలీ 11 నో బాల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

బౌలింగ్‌పై కసరత్తు చేయకుంటే.. ఉద్వాసన తప్పదు..

అర్ష్‌దీప్ సింగ్ తన బౌలింగ్‌పై టీమిండియా బౌలింగ్ కోచ్‌తో కలిసి పని చేయాల్సి ఉంది. నెట్స్ ప్రాక్టీస్ సమయంలో అతను తన నో బాల్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ సమయంలో కూడా అర్ష్‌దీప్ తన పాదాలను క్రీజ్‌లో ఉంచడానికి ప్రయత్నించాలి. లేకపోతే, అతని ఈ పొరపాటు పెద్ద టోర్నమెంట్లలో భారత్‌కు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. అర్ష్దీప్ సింగ్ ఒక యువ క్రికెటర్, అతను భారతదేశానికి భవిష్యత్తు బౌలర్. కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఇన్ని తప్పులు చేయడం ఏ బౌలర్‌కూ అంత మంచిదికాదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..