
IND vs NZ 1st T20I : వన్డే సిరీస్‌ను కోల్పోయిన కసిలో ఉన్న టీమిండియా, ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లో కివీస్‌ను దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా బుధవారం (జనవరి 21) రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ గాయం కారణంగా ఈ సిరీస్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లకు దూరం కావడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. అతనికి ఆపరేషన్ జరగడంతో, అతని స్థానంలో వెటరన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే, టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో ఉన్న ఇషాన్ కిషన్ కూడా రేసులో ఉన్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తారా లేక శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయ్యర్ ప్రస్తుతం వరల్డ్ కప్ జట్టులో లేనందున, బ్యాకప్ ప్లేయర్‌గా అతన్ని పరీక్షించే అవకాశం ఉంది.
ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ వచ్చే అవకాశం ఉంది. వికెట్ కీపర్ బాధ్యతలతో పాటు ఓపెనర్‌గా సంజూ తన మార్క్ చూపించాల్సి ఉంది. వన్డేల్లో వైఫల్యాలు చవిచూసిన సూర్యకుమార్ యాదవ్, తనకు ఇష్టమైన టీ20 ఫార్మాట్‌లో మళ్ళీ ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు. ఆల్ రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబేలు జట్టుకు బలాన్ని ఇస్తున్నారు. ఇక ఫినిషర్ పాత్రలో రింకూ సింగ్ మరోసారి తన పవర్ చూపించడానికి సిద్ధమయ్యాడు.
బౌలింగ్ విషయానికి వస్తే.. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు పేస్ బాధ్యతలు మోయనున్నారు. నాగ్‌పూర్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, వరుణ్ చక్రవర్తి ప్రధాన స్పిన్నర్‌గా బరిలోకి దిగడం ఖాయం. మరో స్పిన్ ఆప్షన్‌గా రవి బిష్ణోయ్ లేదా కుల్దీప్ యాదవ్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. వన్డే సిరీస్ కోల్పోయిన భారత్, ఈ టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించి వరల్డ్ కప్ ముందర ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..