IND vs ENG 2nd T20I : భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు.. క్రికెట్ అభిమానులకు మళ్లీ నిరాశేనా?

IND vs ENG 2nd T20I : భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌కు మాంచెస్టర్‌లో మరోసారి వర్షం ముప్పు నెలకొంది. టాస్‌కూ అంతరాయం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి.

IND vs ENG 2nd T20I : భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు.. క్రికెట్ అభిమానులకు మళ్లీ నిరాశేనా?
Wasim Jaffer

Updated on: Jul 04, 2026 | 8:50 AM

IND vs ENG 2nd T20I : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు (శనివారం) జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు క్రికెట్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ వినబడుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని యువ టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి, సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. కానీ, మాంచెస్టర్ వాతావరణం చూస్తుంటే అభిమానుల నిరీక్షణ ఇంకాస్త పొడగించేలా కనిపిస్తోంది. మొదటి మ్యాచ్ లాగే ఈ రెండో మ్యాచ్‌పై కూడా వరుణుడి నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే టెన్షన్ అటు ఆటగాళ్లలోనూ, ఇటు ఫ్యాన్స్‌లోనూ మొదలైంది.

టాస్ పడటం కూడా కష్టమే

ప్రముఖ వాతావరణ వెబ్‌సైట్ అక్యువెదర్ నివేదిక ప్రకారం.. శనివారం మాంచెస్టర్ నగరంలో వాతావరణం దోబూచులాడనుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే పగటిపూట వర్షం పడే అవకాశం సుమారు 57 శాతంగా ఉంది. మైదానం చుట్టూ దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల టాస్ సమయానికి పడటం కూడా అనుమానంగానే మారింది. ఇక ఇంగ్లాండ్ కాలమానం ప్రకారం మ్యాచ్ జరిగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల సమయంలో కూడా వర్షం పడే సూచనలు 51 శాతం వరకు ఉన్నాయి. అంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు పదే పదే వర్షం అంతరాయం కలిగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

రద్దు అయ్యే ఛాన్స్ తక్కువే

అయితే, ఈ నిరాశజనకమైన వార్తల మధ్య క్రికెట్ ప్రియులకు ఊరటనిచ్చే ఒక సానుకూల అంశం కూడా ఉంది. ఈ మ్యాచ్ జరగబోయే మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి గ్రౌండ్‌లో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉంది. గతంలో మ్యాచ్ జరిగిన చేస్టర్-లే-స్ట్రీట్ మైదానంతో పోలిస్తే, ఇక్కడ వర్షం తగ్గిన కొద్ది నిమిషాల్లోనే పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను చాలా వేగంగా ఆరబెట్టే సదుపాయం ఉంది. అందువల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువని క్యూరేటర్లు చెబుతున్నారు. ఒకవేళ వర్షం పడినా, ఓవర్ల సంఖ్యను తగ్గించి కనీసం కొద్ది ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తారు.

తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో మెరిసిన శ్రేయస్, అభిషేక్

ఇక అంతకుముందు చేస్టర్-లే-స్ట్రీట్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ కూడా పూర్తిగా వర్షం కారణంగానే రద్దయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇన్నింగ్స్ చివర్లో ఆల్‌రౌండర్ శివమ్ దుబే కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఇంగ్లాండ్ కనీసం ఒక బంతి కూడా ఆడకుండానే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే రెండో మ్యాచ్‌కైనా వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us