
Mullanpur Weather: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే ఆ రెండో జట్టు ఏదో తేలాల్సి ఉంది. ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న క్వాలిఫైయర్-2 పోరుపైనే అందరి కళ్లు ఉన్నాయి. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తలు రావడంతో, ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరేది ఎవరనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో తలపడుతుంది. ఇప్పటికే క్వాలిఫైయర్-1లో గుజరాత్‌ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన రజత్ పాటిదార్ సేన (RCB) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. మరోవైపు ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి రాజస్థాన్ రాయల్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో క్వాలిఫైయర్-2కు దూసుకొచ్చింది. ముఖ్యంగా రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 27 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించడంతో రాయల్స్ శిబిరం జోష్‌లో ఉంది.
ఇది కూడా చదవండి: GT vs RR: 10 ఏళ్ల హిస్టరీ రిపీట్‌కు అడ్డుగా ఆ 4 ఓవర్లు.. రాజస్థాన్ ఫేట్ మారేనా?
ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా లేదా అని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆరా తీస్తున్నారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్‌కు మినహా క్వాలిఫైయర్-2 లేదా ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ఎలాంటి రిజర్వ్ డే ఉండదు. వర్షం కారణంగా ఆట నిలిచిపోతే, ఫలితం తేల్చడానికి అంపైర్లకు అదనంగా 120 నిమిషాల (2 గంటలు) సమయం ఉంటుంది. ఈ సమయంలోగా కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే ‘సూపర్ ఓవర్’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అయితే, తాజా వెదర్ రిపోర్ట్ ప్రకారం వర్షం పడే ఛాన్స్ కేవలం 30 – 40 శాతం మాత్రమే ఉంది. దీంతో మ్యాచ్ సజావుగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దురదృష్టవశాత్తూ ముల్లాన్‌పూర్‌లో వాతావరణం ఏమాత్రం సహకరించక, కనీసం సూపర్ ఓవర్ వేసే అవకాశం కూడా లేకపోతే.. లీగ్ దశ పాయింట్ల పట్టిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఏ జట్టు అయితే అగ్రస్థానంలో (హయ్యర్ ర్యాంక్) ఉంటుందో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ సమీకరణాల ప్రకారం చూస్తే గుజరాత్ టైటాన్స్‌కు బంపర్ ఆఫర్ తగిలినట్లే. లీగ్ దశలో శుభ్‌మన్ గిల్ సేన రెండో స్థానంలో నిలిచింది. కాగా, రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌కు చేరింది. కాబట్టి వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న రన్నరప్ గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ ఆట ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..