
ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టీ20ఐ ర్యాకింగ్స్ లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ లువాన్ డ్రే ప్రిటోరియస్ భారీగా దూసుకొచ్చాడు. ఇటీవల దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా మధ్య జరిగిన టీ20ఐ ట్రై సిరీస్‌లో అతడి తుఫాన్ బ్యాటింగ్‌కు మంచి ర్యాంకింగ్ ఫలితం దక్కింది. ఏకంగా 61 స్థానాలు ఎగబాకిన ప్రిటోరియస్ ఉమ్మడి 43వ ర్యాంక్కు చేరాడు. అదే సమయంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెండు స్థానాలు కోల్పోయి 49వ స్థానానికి పడిపోయాడు.
దక్షిణాఫ్రికా ట్రై-సిరీస్ టైటిల్ గెలవడంలో ప్రిటోరియస్ కీలక పాత్ర పోషించాడు. మొత్తం 226 పరుగులు చేసిన అతడు 56.50 సగటుతో, 179.37 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. నమీబియాపై ఎదురైన ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా పుంజుకుని టైటిల్ సాధించడంలో అతడి బ్యాటింగ్ ముఖ్యంగా నిలిచింది.
ఈ ప్రదర్శనతోనే అతడు తన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) టీంమేట్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ని ర్యాంకింగ్స్‌లో అధిగమించాడు. అయితే ప్రిటోరియస్ ప్రస్తుతం గ్రోయిన్ ఇంజ్యూరి (groin injury) నుంచి కోలుకుంటున్నాడు. త్వరలో జరిగే భారత్-అఫ్గానిస్థాన్ టీ20ఐ సిరీస్‌లో వైభవ్‌కు తిరిగి పైకి వెళ్లే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికా బ్యాటర్ కానర్ ఎస్టర్‌హైజెన్ కూడా ర్యాకింగ్స్ లో గణనీయంగా ముందుకొచ్చాడు. ట్రై-సిరీస్‌లో 126 పరుగులు చేసిన అతడు 172.60 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అందులో ఫైనల్లో 32 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఉంది.
ట్రై సిరీస్‌లోని ఆరో మ్యాచ్‌లో ఎస్టర్‌హైజెన్ కేవలం 40 బంతుల్లో 88 పరుగులు చేసి దక్షిణాఫ్రికా 228 పరుగుల భారీ స్కోరు సాధించడంలో సహకరించాడు. ఆ స్కోరును కాపాడుకుని ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న దక్షిణాఫ్రికా.. ఎస్టర్‌హైజెన్‌కు ర్యాంకింగ్స్‌లో 65 స్థానాల పురోగతిని అందించింది. అతడు కెరీర్ బెస్ట్ 627 రేటింగ్ పాయింట్లతో 25వ స్థానానికి చేరాడు.
నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ బ్యాట్‌తో 149 పరుగులు, బంతితో 5 వికెట్లు సాధించాడు. దీంతో టీ20ఐ ఆల్ రౌండర్స్ (T20I All Rounders) లో ఎనిమిదో ర్యాంక్ కు చేరాడు. బ్యాటర్ల జాబితాలోనూ 16 స్థానాలు ఎగబాకి 55వ స్థానంలో నిలిచాడు. లౌరెన్ స్టీన్‌క్యాంప్ 122 పరుగులతో ఉమ్మడి 73వ స్థానానికి చేరాడు.
జింబాబ్వే ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ ట్రై సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ దక్షిణాఫ్రికాపై జింబాబ్వే తరపున నంబర్ 8 బ్యాటర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. దీంతో ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లో 14 స్థానాలు మెరుగై 25వ స్థానానికి, బౌలర్స్ జాబితాలో నాలుగు స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరాడు.
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టీ20ఐ ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లో (T20I all-rounders Rankings)లో అగ్రస్థానాన్ని కొనసాగించాడు. రెండో స్థానంలోని సయీమ్ అయూబ్ కంటే 46 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ట్రై-సిరీస్‌లో 3 వికెట్లు తీసిన రజా బౌలర్ల జాబితాలోనూ రెండు స్థానాలు మెరుగుపడి 27వ ర్యాంక్కు చేరాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..