IND Vs PAK: సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు చూస్తే మతిపోవాల్సిందే

2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై నెలకొన్న వివాదం పరిష్కారం దిశగా సాగుతోంది. ఐసీసీ ప్రతినిధులు పీసీబీ ఛైర్మన్ నఖ్వీతో లాహోర్‌లో సమావేశమయ్యారు. పాకిస్తాన్ వార్షిక నిధుల పెంపు, భారత్‌తో ద్విపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లాంటి డిమాండ్లు ఐసీసీ ముందు ఉంచింది పీసీబీ. బంగ్లాదేశ్ కూడా ఆర్థిక పరిహారం కోరినట్టు తెలుస్తోంది.

IND Vs PAK: సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు చూస్తే మతిపోవాల్సిందే
Pakistan Cricket

Updated on: Feb 09, 2026 | 4:20 PM

టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌పై పాకిస్తాన్ తీసుకున్న బాయ్‌కాట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతినిధులు పాకిస్తాన్‌కు చేరుకుని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ నఖ్వీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. లాహోర్‌లో జరిగిన ఈ సమావేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం కూడా పాల్గొన్నారు. ఈ చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ అత్యవసర బేటీలో, పాకిస్తాన్ తన బహిష్కరణను తప్పించేందుకు కొన్ని షరతులను ఐసీసీ ముందు ఉంచినట్లు సమాచారం. పీసీబీ ఛైర్మన్ నఖ్వీ ఐసీసీకి మూడు ప్రధాన డిమాండ్లను సమర్పించారు. మొదటిది, పాకిస్తాన్‌కు వార్షిక నిధులు పెంచడం. ఇది పాకిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు అవసరమని పీసీబీ భావిస్తోంది. రెండవది, భారత్‌తో ద్విపాక్షిక సిరీస్‌లను తిరిగి ప్రారంభించేందుకు ఐసీసీ సహకారం అందించాలని పీసీబీ కోరింది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపడటానికి ఇది కీలకమని పీసీబీ వాదన. మూడవది, భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లలో ఆటగాళ్ళు సంప్రదాయ హ్యాండ్ షేక్‌లను పాటించాలని నఖ్వీ కోరారు. గతంలో ఆసియా కప్‌లో చోటు చేసుకున్న నో హ్యాండ్ షేక్ ఘటనను ఈ సందర్భంగా నఖ్వీ ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అన్నింటి కంటే హ్యాండ్ షేక్ డిమాండ్ నఖ్వీ పర్సనల్ అని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అటు ఈ సమావేశంలో బంగ్లాదేశ్ కూడా తన డిమాండ్లను వెల్లడించింది. బీసీబీ ఐసీసీ నుంచి ఆర్థిక పరిహారం ఇవ్వాలని కోరింది. అదనంగా, భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ నిర్వహణ హక్కులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా 2028 అండర్-19 ప్రపంచకప్ నిర్వహణపై బంగ్లాదేశ్ ఆసక్తి చూపినట్లు సమాచారం. కాగా, ఈ కీలక అంశాలపై రెండు, మూడు రోజుల్లోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

మరోవైపు భారత్‌తో మ్యాచ్‌ ఆడాలంటే పాకిస్తాన్‌ పెట్టిన 3 కండిషన్లు ఇవేనని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మొదటిది బంగ్లాదేశ్‌కు పరిహారం పెంచాలి. ప్రతీ ఏటా ఐసీసీ నుంచి వచ్చే పరిహారాన్ని ఇంకా పెంచాలంటోంది. రెండోది ఇక పరిహారంతో పాటు బంగ్లాకు పార్టిసిపేషన్‌ ఫీజు చెల్లించాలంటోంది. మూడోది అంతేకాదు రాబోయే ICC ఈవెంట్స్‌లో పాకిస్తాన్‌కు భాగస్వామ్యం ఇవ్వాలని డిమాండ్‌ కూడా చేస్తోంది.